అమరజీవికి నివాళులు
అమలాపురం రూరల్: తెలుగు ప్రజల హక్కుల కోసం తన ప్రాణాలను అర్పించిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు అమరజీవి అని కలెక్టర్ ఆర్. మహేష్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినాన్ని (73వ వర్ధంతి) పురస్కరించుకుని కలెక్టర్ శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాషాభిమానం, త్యాగం, సంకల్పబలం ఆయన జీవనానికి ప్రతీకలన్నారు. ఆయన త్యాగం వల్లే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అవతరించిందన్నారు. తెలుగు భాష మాట్లాడే ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన ఆయన త్యాగం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఆయన నిరాహార దీక్షను 58 రోజుల పాటు కొనసాగించి 1952 డిసెంబర్ 15న అసువులు బాశారన్నారు. తర్వాత 4 రోజులకు అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారన్నారు. ఆయన ఉద్యమ ప్రభావం ఫలితంగా దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయన్నారు. ఈ జాయింట్ కలెక్టర్ నిషాంతి, డీఆర్‌ఓ కే.మాధవి, ఏవో కాశీ విశ్వేశ్వరరావు, సూపరింటెండెంట్ సుబ్బరాజు పాల్గొన్నారు.
255 అర్జీల స్వీకరణ
అమలాపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా సోమవారం కలెక్టరేట్‌లో 255 అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ నిషాంతి, డీఆర్‌ఓ కే.మాధవి సమగ్ర శిక్ష ఏపీసీ జి.మమ్మీ, డీఎల్‌డీవో రాజేశ్వరరావు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు
33 అర్జీలు
అమలాపురం టౌన్: స్థానిక ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 33 అర్జీలు వచ్చాయి. ఎస్పీ, ఏఎస్పీ అందుబాటులో లేకపోవడంతో అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్ పోలీస్ గ్రీవెన్స్ నిర్వహించారు. గ్రీవెన్స్ పర్యవేక్షణ ఎస్సై గంగాభవాని పాల్గొన్నారు.
శిల్పి రాజ్‌కుమార్‌కు ‘బాలు’ స్మారక పురస్కారం
కొత్తపేట: అంతర్జాతీయ శిల్పి డాక్టర్ డి.రాజ్‌కుమార్ వుడయార్ ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు శ్రీపతి పండితారాధ్యుల (ఎస్‌పీ) బాలసుబ్రహ్మణ్యం (బాలు) స్మారక పురస్కారం అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో నెలకొల్పిన బాలు కాంస్య విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించారు. ఆ సందర్భంగా జరిగిన సభలో రాజ్‌కుమార్‌ను మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ఆ రాష్ట్ర మంత్రి డి. శ్రీధర్‌బాబు చేతుల మీదుగా బాలు స్మారక పురస్కారంతో సత్కరించారు.
జెడ్పీలో పలువురికి ఉద్యోగోన్నతులు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌లో పలువురికి ఉద్యోగోన్నతులు కల్పిస్తూ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు సోమవారం నియామక ఉత్తర్వులు అందజేశారు. నలుగురు సీనియర్ సహాయకులకు పరిపాలనాధికారులుగా, ఐదుగురు జూనియర్ సహాయకులకు, ముగ్గురు టైపిస్ట్‌లకు సీనియర్ సహాయకులుగా, పది మంది రికార్డు అసిస్టెంట్లకు జూనియర్ సహాయకులుగా ప్రమోషన్లు ఇచ్చారు. ఒకరికి కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేశారు. జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు కూడా పాల్గొన్నారు.
అమరజీవికి నివాళులు
అమరజీవికి నివాళులు


