ఏడిపింఛెన్
ఎదురుచూపులతో
● కలగా కొత్త పింఛన్లు
● జిల్లాలో పడిగాపులు కాస్తున్న
70 వేల మంది లబ్ధిదారులు
● మంజూరుకు చంద్రబాబు
సర్కార్ మీనమేషాలు
● గత ప్రభుత్వంలో ఏడాదికి
రెండుసార్లు అవకాశం
ఆలమూరు: వయసు మీరి, అచేతన స్థితిలో ఉన్నవారికి.. కుటుంబ పెద్ద లేక పూట గడవని కుటుంబాలకు.. వికలాంగత్వంతో పనులకు వెళ్లలేని నిస్సాహాయకులకు.. ప్రభుత్వం అందించే సామాజిక పింఛన్లే కొండంత అండ. అలాంటి పింఛన్ల కోసం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి 18 నెలలు పూర్తయినా ఒక పింఛను కూడా మంజూరు చేయకుండా లబ్ధిదారుల జీవితాలతో ఆటలాడుతోంది. కుటుంబాన్ని పోషించే భర్తను కోల్పోయి ఎలాంటి ఆసరా లేక పుట్టెడు దుఖఃతో దుర్భర జీవితం అనుభవిస్తున్న అనేక మంది వితంతువుల పట్ల కూడా ప్రభుత్వం కనికరం చూపడం లేదు. అర్హులకు కొత్త పింఛన్లు ఇవ్వకపోగా, అనేక మందిని అనర్హుల పేరిట తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త వికృత క్రీడకు తెరలేపింది. అఽధికారంలోకి వచ్చాక అర్హులందరికీ కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. కొత్త పింఛన్లు ఎప్పుడిస్తారో, ఎప్పుడు గ్రామ సచివాలయాల్లో పింఛన్ల నమోదు ప్రక్రియను ప్రారంభిస్తారో తెలియని పరిస్థితి అంతటా నెలకొంది. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వృద్ధాప్య పింఛను మంజూరు చేస్తామంటూ ఇచ్చిన ఎన్నికల హామీని కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. కొత్త పింఛన్ల ఊసెత్తకుండా ప్రతి నెలా పాత పింఛన్ల పంపిణీలో ఏవిధంగా పాల్గొనమంటారని కూటమి నేతలే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం గమనార్హం. జిల్లాలోని 22 మండలాలు, మూడు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ పరిధిలో 2,36,705 మంది వివిధ పింఛన్‌దారులు ఉండగా, ప్రతి నెలా రూ.101.86 కోట్ల పంపిణీ జరుగుతుంది.
గతమెంతో ఘనం
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంతో పేదల అభ్యున్నతే లక్ష్యంగా కుల మతాలకతీతంగా ఏటా క్రమం తప్పకుండా జనవరి, జూలై నెలల్లో కొత్త పింఛన్లను మంజూరు చేసి పండగలా పంపిణీ చేసేవారు. జిల్లాలో 2024 జనవరిలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో 7,489 కొత్త పింఛన్లు మంజూరు చేశారు. అప్పటి నుంచి జూన్ వరకూ (అధికారం నుంచి దిగిపోయే నాటికి) గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పింఛన్ల మంజూరు కోసం ఆన్‌లైన్‌లో 8,467 మంది దరఖాస్తు చేసుకున్నారు. వైఎస్సార్ సీపీ మళ్లీ అఽధికారం చేపట్టి ఉంటే 2024 జూలైలో కచ్చితంగా అర్హులందరికీ పింఛన్లు మంజూరయ్యే పరిస్థితి ఉండేదనే అభిప్రాయం అంతటా వ్యక్తమవుతుంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా నవంబర్ నెలాఖరు నాటికి సుమారు 70 వేల మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాలను బట్టి తెలుస్తోంది.
దరఖాస్తుల స్వీకరణ నిలిపివేత
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న వారికి పింఛన్లు మంజూరు చేయకపోవడంతో పాటు కొత్త దరఖాస్తుల స్వీకరణ కూడా నిలిపివేసింది. లబ్ధిదారులు ఎవరైనా గ్రామ సచివాలయానికి వెళ్లి పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటామని చెబితే ఇప్పటికే మూసివేసిన ఆన్‌లైన్ ప్రక్రియ ఇంకా పునః ప్రారంభం కాలేదని, మార్గదర్శకాలను విడుదల చేయలేదని సిబ్బంది చెబుతున్నారు. ఇటీవల కాలంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పింఛన్లు మంజూరు చేయాలంటూ వచ్చే దరఖాస్తులే అధికంగా ఉంటున్నాయి.
మళ్లీ నిర్ధారణ అంటూ..
రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్లను మంజూరు చేయకపోగా, పాత వాటిలో కోత విధిస్తుంది. జిల్లా వ్యాప్తంగా 32,101 మందికి దివ్యాంగ పింఛన్లు ఉండగా, అందులో అనర్హుల పేరిట కోత విధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇప్పటికి ఒక దఫా పరిశీలన చేసిన ప్రభుత్వం మరోసారి పునః పరిశీలించేందుకు ఏర్పాట్లు చేసింది. తొలి విడతలో 2,964 మంది దివ్యాంగులను అనర్హులుగా గుర్తించారు. ఈ సర్వేపై ప్రజా వ్యతిరేకత రావడంతో మళ్లీ వైకల్య నిర్ధారణ ప్రక్రియను రామచంద్రపురం, అమలాపురం ఏరియా ఆసుపత్రుల్లో దశల వారీగా సదరం ద్వారా నిర్వహిస్తుంది. దాదాపు 80 శాతం కంటే ఎక్కువగా ఉన్న మానసిక, మంచానికే పరిమితమైన దివ్యాంగులకు ఇచ్చే రూ.15 వేలల్లో కోత విధించడం లేదా రూ.ఆరు వేలకే పరిమితం చేయడం జరిగింది. అలాగే స్పౌజ్ పింఛన్ల మంజూరులో అనర్హత పేరిట ప్రభుత్వం 802 మంది వితంతువులకు పింఛన్లను ఇప్పటికే నిలిపివేసింది.
ఇచ్చే సొమ్ములో కోతపెట్టి..
ఆలమూరు మండలం పినపళ్లలో పలువురు మానసిక దివ్యాంగులకు అన్ని అర్హతలున్నా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న విధంగా రూ.15 వేలు కాకుండా కేవలం రూ.ఆరు వేలు మాత్రమే పంపిణీ చేస్తున్నారు. దీనిపై తల్లిదండ్రులు పలుమార్లు ఉన్నతాధికారులకు వివరించినా ప్రయోజనం లేదు. దివ్యాంగ పిల్లలను గ్రామ సర్పంచ్ సంగిత సుభాష్ సహకారంతో మరోసారి అంగవైకల్యం నిర్ధారణ పేరిట వ్యయ ప్రయాసల కోర్చి రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పింఛన్లు పూర్తిస్థాయిలో అందని వారిలో కుమ్మరపురుగు హేమంత్‌కుమార్, రాయపాటి దుర్గావీర వెంకట సత్యనారాయణ, కడియాల సురేష్, కరెళ్ల వీరభద్రరావు ఉన్నారు. ఇలా జిల్లాలో చాలామంది ఉన్నారు.
కదలలేని స్థితిలో
దివ్యాంగుడు దుర్గావీర
వెంకట సత్యనారాయణ
జీవనాధారం కోల్పోయాను
నా భర్త ఏడాదిన్నర క్రితం గుండె పోటుతో మరణించారు. కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు కోల్పోవడంతో నేను, నా కుమారుడు అనాథలయ్యాం. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. జీవనాధారం లేక ఇంటర్ చదువుతున్న నా కుమారుడిని చదువును మాన్పించి దుస్తుల దుకాణంలో పనికి పెట్టాను. ప్రభుత్వం నుంచి పింఛన్ వస్తే కుటుంబ పోషణకు ఇబ్బంది ఉండదు. కుమారుడిని చదివించుకోగలుగుతాను.
– మధుర ఆదిలక్ష్మి, మధురపేట,
ఉప్పలగుప్తం మండలం
మంచానికే పరిమితమైనా..
అనారోగ్యంతో మంచానికే పరిమితమై దాదాపు ఏడాది దాటింది. సదరు సర్టిఫికెట్, ఆధార్ కార్డుతో వెళ్లి గ్రామ సచివాలయంలో పింఛన్‌కు దరఖాస్తు చేసుకుందామంటే సైట్ తెరుచుకోవడం లేదని సిబ్బంది చెబుతున్నారు. జీవనోపాధి కోసం నా భార్య చిన్న చిన్న పనులు చేసుకుంటూ నాకు చికిత్స చేయిస్తుంది. దివ్యాంగులను కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరం.
– నాగవరపు శ్రీనివాసరావు,
పితానివారిపాలెం, కామనగరువు
ఏడిపింఛెన్
ఏడిపింఛెన్
ఏడిపింఛెన్


