ఉద్యమానికి ఉప్పెనలా..
● తాడేపల్లికి తరలించనున్న
4.50 లక్షల సంతకాల ప్రతులు
● నేడు అమలాపురంలో భారీ పాదయాత్ర
అమలాపురం టౌన్: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఓ ఉప్పెనలా.. ఉద్యమంలా సాగింది. అదే చైతన్యంతో జిల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి సేకరించిన దాదాపు 4.50 లక్షల సంతకాల ప్రతులను అమలాపురం నుంచి విజయవాడ సమీపంలోని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి సోమవారం ఉదయం తరలించేందుకు జిల్లా పార్టీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఏడు నియోజకవర్గాల నుంచి సంతకాల ప్రతులు అమలాపురం మండలం భట్నవిల్లిలోని పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటికి చేర్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రతులను విశ్వరూప్ ఇంటి నుంచి సోమవారం ఉదయం అమలాపురం హైస్కూల్ సెంటర్ సమీపంలోని పాత వెంకటరమణ థియేటర్ ప్రాంతానికి తరలించనున్నారు. అక్కడ నుంచి ప్రతులు ఉంచిన వాహనంతో పాటు జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు హైస్కూల్ సెంటర్, గడియారం స్తంభం సెంటర్, ఆర్టీసీ బస్ స్టేషన్ రోడ్డు, ఈదరపల్లి వంతెన వరకూ పాదయాత్ర నిర్వహించనున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, మండపేట నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయరావు, బొమ్మి ఇజ్రాయిల్, రాజోలు, ముమ్మిడివరం, అమలాపురం, రామచంద్రపురం, పి.గన్నవరం నియోజకవర్గాల పార్టీ కో ఆర్డినేటర్లు గొల్లపల్లి సూర్యారావు, పొన్నాడ వెంకట సతీష్‌కుమార్, డాక్టర్ పినిపే శ్రీకాంత్, పిల్లి సూర్యప్రకాష్, గన్నవరపు శ్రీనివాసరావు తదితర పార్టీ ప్రముఖులు పాదయాత్రలో పాల్గొంటారు. ఉదయం ఉదయం 9 గంటలకు పార్టీ శ్రేణులు తరలి వచ్చేలా జిల్లా పార్టీ అధ్యక్షుడు జగ్గిరెడ్డి ‘చలో అమలాపురం’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అమలాపురంలోని పాత వెంకటరమణ థియేటర్ నుంచి పాదయాత్ర మొదలయ్యాక స్థానిక హైస్కూల్ సెంటర్‌లోని మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించి తిరిగి యాత్ర మొదలవుతుంది. కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ పాదయాత్రలో వైఎస్సార్ సీపీ నేతలు నినాదాలు చేయనున్నారు. దాదాపు కిలోమీటరన్నర సాగిన అనంతరం అమలాపురం ఈదరపల్లి వంతెన వద్ద నుంచి 4.50 లక్షల సంతకాలతో బయలుదేరే వాహనం వెంట పార్టీ శ్రేణులు, వారి వాహనాలు అంబాజీపేట, ముక్కామల, కొత్తపేట, రావులపాలెం మీదుగా సిద్ధాంతం వంతెన వరకూ ర్యాలీగా సాగనున్నారు.
అక్కడ నుంచి సంతకాల ప్రతులు ఉన్న వాహనం వెంట కొంత మంది పార్టీ నాయకులు వెళ్లి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పెద్దలకు అప్పగించనున్నారు. అమలాపురం నుంచి మొదలయ్యే పాదయాత్రలో మాజీ ఎంపీ చింతా అనురాధ, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి బాబి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి తదితరులు పాల్గొనున్నారు.
పాదయాత్ర స్థలం పరిశీలన
అమలాపురం హైస్కూల్ సెంటర్ సమీపంలోని ఇప్పటికే కూల్చిన పాత వెంకటరమణ థియేటర్ స్థలాన్ని జేసీబీతో చదును చేస్తున్న పనులను జిల్లా పార్టీ అధ్యక్షుడు జగ్గిరెడ్డి, నియోజకవర్గ కో ఆర్డినేటర్లు పరిశీలించారు. జగ్గిరెడ్డితో పాటు అమలాపురం, పి.గన్నవరం నియోజకవర్గాల పార్టీ కో ఆర్డినేటర్లు డాక్టర్ పినిపే శ్రీకాంత్, గన్నవరపు శ్రీనివాసరావులు పార్టీ నాయకులతో కలసి ఆ స్థలం చదును పనులను పర్యవేక్షించారు. జగ్గిరెడ్డి వెంట పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు సంసాని బులినాని, పార్టీ అనుబంధ కమిటీల రాష్ట్ర, జిల్లా నాయకులు గొవ్వాల రాజేష్, గుత్తుల రాజు, విత్తనాల శేఖర్, దొమ్మేటి రాము తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమానికి ఉప్పెనలా..


