పాఠశాల విద్యను పరిరక్షించాలి
● 12వ పీఆర్సీని తక్షణం అమలు చేయాలి
● యూటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో వక్తల డిమాండ్
రాయవరం: పాఠశాల విద్యను పరిరక్షించాల్సిన తక్షణ కర్తవ్యం ప్రభుత్వంపై ఉందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి, మాజీ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు (ఐవీ) డిమాండ్ చేశారు. ఆదివారం రాయవరం మండలం పసలపూడి చింతా సుబ్బారాయుడు చారిటబుల్ ట్రస్ట్ వేదికగా యూటీఎఫ్ నాల్గో జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి.సురేంద్రకుమార్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో గోపిమూర్తి, ఐవీలు మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాల విద్యను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఐదు దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న హక్కులను ప్రభుత్వం కబళిస్తుందన్నారు. యూటీఎఫ్ సంఘం హక్కుల కోసం పోరాడుతూనే, అదే సమయంలో బాధ్యతలను పంచుకుంటుందన్నారు. ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే నూతన పీఆర్సీ కమిటీ చైర్మన్‌ను నియమించి, ఐఆర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు ఎస్.కిషోర్‌బాబు, ఎస్‌పీ మనోహర్, సీనియర్ నాయకులు గారా చిట్టిబాబు, డీవీ రాఘవులు, పెంకే వెంకటేశ్వరరావు తదితరులు విద్యారంగం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఏడాది కాలంగా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి యూటీఎఫ్ జిల్లా శాఖ చేపట్టిన కార్యక్రమాలను యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.సురేంద్రకుమార్, ఎంటీవీ సుబ్బారావు తెలిపారు. అనంతరం జిల్లా నూతన కౌన్సిల్ ఎన్నిక రాష్ట్ర కార్యదర్శి మనోహర్ అధ్యక్షతన ఏకగ్రీవంగా జరిగింది. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా జీవీ రమణ, ఎంటీవీ సుబ్బారావు, గౌరవ అధ్యక్షుడిగా పి.వెంకటేశ్వరరావు, సహ అధ్యక్షుడిగా వైవీఎస్‌ఎన్ బాలాజీ, మహిళా అధ్యక్షురాలిగా మేరీరూత్, ట్రెజరర్‌గా కేశవరావులు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు కడలి శ్రీనివాసరావు, జి.మురళీకృష్ణ, గుంటూరి అప్పారావు, గరగ సీతాదేవి, ఎ.గాయత్రీదేవి, కేవీఆర్ తాతాజీ, దొంతంశెట్టి సతీష్, నల్లమిల్లి భాస్కరరెడ్డి, కిలపర్తి శ్రీనివాసరావు, కె.అర్జునుడు, సీహెచ్ శ్రీరామచంద్రమూర్తి, చిక్కాల శ్రీనివాస్, కె.సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


