మహిళలపై అఘాయిత్యాలు అరికట్టండి
అల్లవరం: మహిళలు, బాలికలపై అఘాయిత్యాలను అరికట్టి, నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున గంజాయి, మత్తు పదార్థాలకు బానిసై నైతిక విలువలు, మానవత్వాన్ని మరిచి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఐ.పోలవరం మండలం బాణాపురంలో ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన మరువక ముందే ముమ్మిడివరం మండలం ఠాణేలంకలో 15 రోజుల క్రితం ఓ మహిళ సాయంతో అమ్మాయిని కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడిన విషయం తెలిసిందేనన్నారు. ఇప్పుడు ఉప్పలగుప్తం మండలం ఓ గ్రామంలో కన్న కూతురిపై కన్నేసి ఓ వ్యక్తి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన అత్యంత దారుణమని అన్నారు. మానవత్వం లేకుండా కన్న పిల్లలపై దారుణానికి ఒడిగట్టిన వ్యక్తులను అత్యంత కఠినంగా శిక్షించాలన్నారు. ఇటీవల జరిగిన ఈ మూడు కేసుల్లో జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రత్యేక చొరవ తీసుకుని పాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి ముద్దాయిలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరికి భయం పుట్టేలా పీడీ యాక్ట్ ప్రయోగించి శిక్షలు అమలు చేయాలని సూచించారు.


