సీఆర్‌ఎంటీ టీచర్ల ఆత్మగౌరవ దీక్ష
జీతాలు పెంచాలని డిమాండ్
అమలాపురం రూరల్: సీఆర్‌ఎంటీ (క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్)లకు జీతాలు పెంచి పీఆర్‌సీ అమలు చేయాలని కోరుతూ ఆత్మగౌరవ దీక్షను కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్‌లో సోమవారం నిర్వహించారు. రాష్ట్ర సీఆర్‌ఎంటీ యునైటెడ్ ఫోరం పిలుపు మేరకు ఈ దీక్ష నిర్వహించారు. స్కూల్ కాంప్లెక్స్‌లను ఏ, డీ క్లస్టర్లుగా చేయాలన్న ప్రతిపాదిత విధానాన్ని రద్దు చేయాలని, ఒకే విధానాన్ని అమలు చేయాలని కోరారు. అదే మండలంలో మిగిలిన సీఆర్‌ఎంటీల సేవలను వినియోగించుకోవాలని డిమాండ్ చేశారు. 2011లో ఎంపికై న తమకు స్కూల్ అసిస్టెంట్ బేసిక్ పే రూ.44,570 అమలు చేయాలి కోరారు. సీఆర్‌ఎంటీలను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలి కోరారు. రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచాలి, రిటైర్డ్ అయినవారికి గ్రాట్యుటీ, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. మాజీ ఎమ్మెల్సీ యిళ్ల వెంకటేశ్వరరావు దీక్షకు మద్దతు తెలిపారు. ఏపీ సీఆర్‌ఎంటీ కోనసీమ జిల్లా గౌరవ అధ్యక్షుడు మెండు శ్రీనుబాబు, అధ్యక్షుడు నామాడి వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి పాము రవికుమార్, ట్రెజరర్ అర్జున్, మహిళా సెక్రటరీ ముత్తాబత్తుల అనూష, భరోసా కన్వీనర్ గూటం నాగన్న పాల్గొన్నారు.


