‘వస్త్రాపహరణ సూచనతో కర్ణుడి పుణ్యాలు నశించాయి’
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ద్రౌపది, పాండవుల వస్త్రాలను ఊడబెరకమంటూ దుశ్శాసనుడికి చెప్పిన వాడు కర్ణుడని, ఈ సూచనతో అతడు చేసిన పుణ్యాలన్నీ నశించిపోయాయని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. వ్యాస భారత ప్రవచనాన్ని స్థానిక హిందూ సమాజంలో సోమవారం ఆయన కొనసాగించారు. ‘ద్రౌపదీ దేవిని ఈడ్చుకు వచ్చిన దుశ్శాసనుడితో కర్ణుడు పలికిన పలుకులు ఘోర పాపాలకు ప్రతిరూపాలు. ద్రౌపది ఏకవస్త్ర అయినా, వివస్త్ర అయినా పాపం లేదు. మానవ కాంతకు ఒకే భర్త. ఈమెకు ఐదుగురు భర్తలుండటంతో ఆమె బంధకి అయింది. ఈ మాటలు అన్నది దుర్యోధనుడు కాదు– కర్ణుడు’ అని చెప్పారు. ద్రౌపది కృష్ణ స్మరణ చేయడంతో.. ఆమె ధర్మమే ఆమెకు అక్షయ వస్త్రాలుగా వచ్చాయని అన్నారు. తాను ఇంతటి పరాభవానికి గురవుతున్నా, ధర్మరాజు ధర్మ మార్గం తప్పడని అనడం ద్రౌపది పాతివ్రత్య ధర్మానికి పరాకాష్ట అని చెప్పారు. ధర్మరాజు ద్యూత వ్యసనపరుడు కాదని, శకుని అలా చిత్రీకరించాడని, అతడి మాటలను ప్రమాణంగా తీసుకోరాదని అన్నారు. ధర్మరాజు.. ధృతరాష్ట్రుడిని తండ్రిగా భావించాడని, ఆయన ఆదేశాన్ని అనుసరించే ద్యూత క్రీడకు వచ్చాడని స్పష్టం చేశారు. తన బదులు శకుని ద్యూతమాడతాడని దుర్యోధనుడు చెప్పినప్పుడు, అది సరికాదని ధర్మరాజు చెబుతూనే, చివరకు అంగీకరిస్తాడని అన్నారు. ‘‘ద్రౌపదిని పణంగా పెట్టమన్న మాట శకుని నోట వచ్చిందని, అది ధర్మరాజు మాట కాదని భీష్ముడు అన్నాడు. ఇందులో ధర్మం గతి అతి సూక్ష్మమైనదని చెప్పాడు. జరిగిన దానిని భీష్ముడు సమర్థించాడని చెప్పడం సరి కాదు. పుట్టినది మొదలు భీష్ముడు ఎటువంటి పాపమూ చేయలేదని కృష్ణుడు అనుశాసన పర్వంలో అన్న మాటలను మనం విస్మరించరాదు. త్వరలో ధార్తరాష్ట్రులందరూ నశిస్తారనిపిస్తోందని భీష్ముడు అంటాడు. ద్రౌపదిని పరాభవిస్తున్న సమయంలో ‘సహదేవా, అగ్ని తీసుకురా. అన్నగారి చేతులను తగలబెడతాను’ అని భీముడు అన్నట్లు అనువాదకులు రాశారు. కానీ, భీముడు అన్న మాటలకు అర్థం అది కాదు. ఇక్కడ వ్యాసుల వారు చెప్పిన శ్లోకం– అస్యాఃకృతే మన్యురయం త్వయి రాజన్ నిపాత్యతే, బాహూ తే సంప్రదక్ష్యామి సహదేవాగ్ని మానయ’– ఇక్కడ ‘తే’ అన్న పదానికి నీ చేతులు అని అర్థం కాదు, నీ సమక్షంలో– నా చేతులు తగులబెట్టుకుంటానని శ్లోక భావం. నీలకంఠీయ వ్యాఖ్యానం కూడా ఇదే భావాన్ని సమర్థిస్తోంది’’ అని సామవేదం వివరించారు. ధృతరాష్ట్రుడు, దుష్టచతుష్టయం తప్ప మిగతావారందరూ తలలు వంచుకుని తీవ్ర ఆవేదనకు గురయ్యారని చెప్పారు. భీముడు ఆవేశపరుడే కానీ, ధర్మపాశానికి, అన్నగారి మాటకు కట్టుబడినవాడని సామవేదం స్పష్టం చేశారు.


