మొసళ్ల ఆచూకీ కోసం గాలింపు
అయినవిల్లి: మండలంలోని అయినవిల్లిలంక పంచాయతీ పరిధిలో కోటిపల్లి భాగ వద్ద ఇటుకబట్టీల కోసం తవ్విన గోతుల్లో మొసళ్లు ఉన్నాయని తెలుసుకున్న అమలాపురం అటవీ రెంజ్ అధికారి ఈశ్వరరావు బృందం గురువారం ఆ పరిసరాలను గాలించారు. పరిసరాల్లోని నీటి గుంటల వద్ద మొసళ్ల పాదముద్రలు సేకరించారు. అయితే ఒకటే మొసలి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు వారు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. స్థానిక రైతులకు, వ్యవసాయ కార్మికులకు వారి ఫోన్ నంబర్లు ఇచ్చి మొసలి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. మొసలి రాత్రి వేళల్లో వేగంగా సంచరిస్తుందని, ఒక చోట నుంచి మరో చోటుకు వేగంగా కదులుతోందన్నారు.
ఇద్దరికి ఏడేళ్ల జైలుశిక్ష
కడియం: బాలుడి మృతి కేసులో కడియం మండలం జేగురుపాడుకు చెందిన రాయి వెంకన్న, నల్లి శేఖర్‌లకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల చొప్పున జరిమానా విధించినట్టు కడియం ఇన్‌స్పెక్టర్ ఎ.వేంకటేశ్వరరావు తెలిపారు. 2018 సెప్టెంబర్ ఏడో తేదీన మోటారు సైకిల్‌లో పెట్రోల్ తీసి దొంగతనం చేస్తున్నాడని సంతోష్‌కుమార్ అనే బాలుడిని వీరు కొట్టారు. దీంతో బాలుడు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పటి సీఐ ఎం.సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. రాజమహేంద్రవరం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి గంధం సునీత 14 మంది సాక్షులను విచారించి, నిందితులకు కేసు ఖరారు చేసినట్టు వెంకటేశ్వరరావు వివరించారు. ప్రాసిక్యూషన్ తరఫున అడిషనల్ పీపీలు కె.రాధాకృష్ణ, రాజులు, రాచపల్లి ప్రసాద్ వ్యవహరించారన్నారు. కోర్టు కానిస్టేబుల్ కె.శ్రీనివాస్ సాక్షులను కోర్టు ముందు హాజరు పరిచారని ఇన్‌స్పెక్టర్ వివరించారు.
మహిళపై కత్తులతో దాడి
పిఠాపురం: పట్టణంలో బుధవారం అర్ధరాత్రి ఓ మహిళపై ఇద్దరు దుండగులు కత్తులతో దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. పిఠాపురం–సామర్లకోట రోడ్డులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న సునీత రాత్రి విధులు ముగించుకుని హైవే మీదుగా స్కూటీపై ఇంటికి వెళ్తోంది. ఆమె సీతయ్య గారి తోట శివారు నరసింగపురం రోడ్డు మీదుగా వస్తుండగా ఇద్దరు వ్యక్తులు వెంబడించి కత్తులతో దాడి చేసినట్టు చెబుతున్నారు. దాడిలో సునీత శరీరంపై పలుచోట్ల తీవ్ర గాయాలయ్యయి. గాయపడ్డ సునీత గట్టిగా అరవడంతో దుండగులు పరారయ్యారు. రక్తపు గాయాలతో ఉన్న సునీతను స్థానికులు ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. సదరు ఘటనపై పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.
17 నుంచి
అభిషేక వేళల మార్పు
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ధనుర్మాసం సందర్భంగా 17వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకూ స్వామివారి ఆర్జిత అభిషేకం వేకువ జామున 4.30 గంటలకు నిర్వహించనున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్‌వీ ప్రసాద్ గురువారం పేర్కొన్నారు. ఇంత వరకూ ఈ అభిషేకాన్ని 5.30 గంటలకు నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. కాగా 16వ తేదీన ఆర్జిత సేవగా స్వామివారి శాంతికల్యాణం జరుగునున్నట్టు ఏసీ ప్రసాద్ అన్నారు. ఈ సేవలకు ఆలయ వెబ్‌సైటు నుంచి గాని, ఆలయం వద్ద కౌంటర్ నుంచి కానీ టిక్కెట్లు పొందవచ్చునని ఆయన అన్నారు.
16 నుంచి ధనుర్మాస వ్రతం
మామిడికుదురు: అప్పనపల్లిలో బాల బాలాజీ స్వామి వారి సన్నిధిలో ఈ నెల 16వ తేదీ నుంచి ధనుర్మాస వ్రతం ప్రారంభమవుతుందని ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు గురువారం తెలిపారు. ఆ రోజు నుంచి జనవరి 14వ తేదీ బుధవారం వరకు ఈ వ్రతం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా నిత్యం ప్రాతఃకాలంలో ఐదు గంటలకు దివ్య ప్రబంధ సేవాకాలం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా స్వామి వారి సన్నిధిలోని ఆండాళ్‌తాయారు (గోదాదేవి)కి ప్రతి రోజు మేళ తాళాలతో అర్చక స్వాములు తీర్థపు బిందెతో గ్రామోత్సవం, ‘తిరుప్పావై’ నిర్వహిస్తారన్నారు. ఇందులో భాగంగా నిత్యం ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా నివేదన, నిత్య హోమం, బలిహరణ, మంగళా శాసనం, తీర్థ ప్రసాద గోష్ఠి ఏర్పాటు చేశామని ఈఓ తెలిపారు.
మొసళ్ల ఆచూకీ కోసం గాలింపు


