కొరతకు కట్టడి
● పశుగ్రాసం కొరతకు పరిష్కారం
● అందుబాటులోకి స్ట్రా బేలర్ యంత్రం
● ఎండుగడ్డిని కట్టలుగా కడుతున్న వైనం
● రైతులకు అదనపు ఆదాయం
ఆలమూరు: వ్యవసాయంలో అనేక ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. వీటివల్ల పని సులభం కావడంతో పాటు కొన్ని సమస్యలకు పరిష్కారం కూడా దొరుకుతోంది. ఇలాంటి వాటిలో గడ్డి సేకరణ యంత్రం (స్ట్రా బేలర్) ఒకటి. ఇప్పటి వరకూ పాడి రైతులను వేధించిన పశుగ్రాసం సమస్యకు దీని ద్వారా చెక్ పడింది. వరి పంట కోతకు ప్రస్తుతం మెషీన్లనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఆ సమయంలో వచ్చిన గడ్డిని కట్టలుగా కట్టడానికి స్ట్రా బేలర్ ఉపయోగపడుతుంది.
లాభదాయకం
యంత్రాలతో పంటను కోసిన వరి పొలాల్లో నిరుపయోగంగా మారిన ఎండుగడ్డిని గతంలో రైతులు తగులబెట్టేవారు. దీనివల్ల కాలుష్యం విపరీతంగా పెరగడంతో పాటు భూసారం తగ్గిపోయే పరిస్థితి ఉత్పన్నమయ్యేది. ఈ స్ట్రాబేలర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో ఎండుగడ్డి కొరత సమస్యకు పరిష్కారం లభించింది. ట్రాక్టర్‌కు దమ్ము చక్రాలు అమర్చే విధంగానే స్ట్రా బేలర్ యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దీని ద్వారా గడ్డి సేకరణ జరపడంతో ఇటు పాడి రైతులకు, అటు కొనుగోలు దారులకు లాభదాయకంగా మారింది.
ఉమ్మడి జిల్లాలో..
ఇటీవల పొలాల్లో వ్యర్థంగా పడి ఉన్న ఎండుగడ్డిని స్ట్రా బేలర్ సాయంతో మోపులుగా కట్టి తీసుకువెళుతున్నారు. దీనివల్ల పాడి రైతులకు, గో సంరంక్షణ కేంద్రాలకు, డెయిరీ ఫాంలకు, పేపర్ మిల్లులకు ఎండుగడ్డి సేకరణ మార్గం సుగమమైంది. అలాగే ట్రాక్టర్ యజమానులు ఈ యంత్రాలను కొనుగోలు చేసి మరింత ఆదాయాన్ని పొందుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 250 వరకూ స్ట్రా బేలర్ యంత్రాలు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాడి ఉమ్మడి జిల్లాలో సాగు చేసిన 4.69 లక్షల ఎకరాల్లో సుమారు 80 శాతం మేర వరి కోత యంత్రాలతో కోసిన గడ్డిని స్ట్రా బేలర్ యంత్రాలతోనే ఒబ్బిడి చేసుకున్నారు.
అదనపు ఆదాయం
స్ట్రా బేలర్ యంత్రంతో సేకరించే పొలంలో ఎకరాకు దాదాపు 1.5 టన్నుల గడ్డి లభిస్తుంది. ఒక్కో గడ్డి మోపు సుమారు 20 కేజీలు ఉంటుంది. ఇలా ఎకరాకు దాదాపు 75 వరకూ గడ్డి మోపులు లభిస్తున్నాయి. ఒక్కొక్క గడ్డిమోపునకు రూ.35 చొప్పున పలకడంతో ఎకరాకు రూ.2,625 ఆదాయం లభిస్తుంది. గతంలో నిరుపయోగంగా మారిన ఎండుగడ్డిని ఈ స్ట్రా బేలర్ యంత్రంతో ఒబ్బిడి చేసుకుని రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు. గతంలో రైతులు ఎండుగడ్డి కోసం కూలీలలో వరి పంటను కోయించేవారు.
ప్రయోజనాలివే..
● పొలాల్లో నిరుపయోగంగా ఉన్న గడ్డిని తగులబెట్టకుండా ఉంచుతున్నారు. దీనివల్ల భూసారం బాగుంటుంది. భూమిలో పోషక విలువలు పెరిగేందుకు, అధిక దిగుబడికి దోహద పడుతుంది.
● వరికోత యంత్రంతో పంటను కోయించిన రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది.
● ఎండుగడ్డి సేకరణ సులభతరం కావడంతో కూలీల కొరతను అధిగమించవచ్చు. గడ్డివాములను సులువుగా వేసుకునేందుకు అవకాశం కలుగుతుంది.
● అగ్ని ప్రమాదాల నివారణకు, కాలుష్య నియంత్రణకు దోహదపడుతుంది. పశుగ్రాసం కొరత అధిగమించడంతో పాటు వాయు కాలుష్యాన్ని నివారించొచ్చు.
రైతునేస్తాలు
ఎండుగడ్డి సేకరణకు అందుబాటులోకి వచ్చిన స్ట్రా బేలర్ యంత్రాలు రైతు నేస్తాలుగా మారాయి. దీనివల్ల వారికి అదనపు ఆదాయం లభిస్తుంది. గతంలో మాదిరిగా పొలాల్లోని ఎండుగడ్డిని తగులబెట్టే విధానాన్ని వదిలేశారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని నివారించడంతో పాటు పశుగ్రాసం కొరత రాకుండా చేసే అవకాశం ఏర్పడింది. ట్రాక్టర్ ఉపకరణ పనిముట్లు మాదిరిగానే ఈ స్ట్రాబేలర్ యంత్రం కూడా మార్కెట్‌లో లభ్యమవుతోంది.
– సీహెచ్‌కేవీ చౌదరి,
వ్యవసాయశాఖ ఏడీ, ఆలమూరు
కొరతకు కట్టడి
కొరతకు కట్టడి
కొరతకు కట్టడి


