చంద్రబాబు ప్రభుత్వ మెడలు వంచుతాం..
● వైద్య కళాశాలలను కాపాడుకుందాం
● ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
కపిలేశ్వరపురం (మండపేట): పేదలకు వైద్య విద్య అందించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రారంభించిన వైద్య కళాశాలలను చంద్రబాబు ప్రభుత్వం మెడలు వంచైనా కాపాడుకుంటామని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ మండపేట నియోజకవర్గంలో చేపట్టిన సంతకాల సేకరణ ఉద్యమం విజయవంతమైన నేపథ్యంలో శుక్రవారం మండపేటలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సంతకాల ప్రతులను పార్టీ జిల్లా కార్యాలయానికి తరలించారు. ర్యాలీని ఎమ్మెల్సీ తోట ప్రారంభించగా, మున్సిపల్ చైర్‌పర్సన్ పతివాడ నూక దుర్గారాణి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, దూలం వెంకన్నబాబు, సీనియర్ నాయకుడు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు రెడ్డి రాజుబాబు, జెడ్పీటీసీ సభ్యులు పుట్టపూడి అబ్బు, కురుపూడి భవాని, ఎంపీపీలు జిత్తుక వెంకటలక్ష్మి, నౌండు వెంకటరమణలు వారి ప్రాంతాలకు నాయకత్వం వహించారు. ఎమ్మెల్సీ త్రిమూర్తులు మాట్లాడుతూ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతున్న చంద్రబాబు విధానాల పట్ల ప్రజల్లో అసహనం ఉందన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రాధాన్యాన్ని వివరించి వాటి పరిరక్షణకు సంతకాలు చేయించాలంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపుతో చేపట్టిన కార్యక్రమం మండపేట నియోజకవర్గంలో విజయవంతమైందన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ముందు భాగాన నిలిచి క్షేత్ర స్థాయిలో పర్యటించడంతో నియోజకవర్గంలో 60 వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేశారన్నారు. కార్యక్రమంలో మండపేట పట్టణం, రూరల్, కపిలేశ్వరపురం, రాయవరం మండలాలకు చెందిన వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


