విచారణ త్వరితగతిన పూర్తి చేయండి
అమలాపురం రూరల్: ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేసి దోషులకు శిక్షపడే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి కొత్త మాధవి సూచించారు. శుక్రవారం అమలాపురంలోని కలెక్టరేట్‌లో 4వ త్రైమాసిక ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కేసుల విషయంలో అవసరమైన కుల ధ్రువీకరణలను రెవెన్యూ అధికారులు సకాలంలో ఇవ్వాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 43 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇందులో 30 కేసులు ఎఫ్‌ఐఆర్ దశలోనూ, 12 కేసులు చార్జిషీట్ దశలో, ఒక కేసు పోస్టుమార్టం దశలో ఉందన్నారు. వీటి నష్ట పరిహారాలకు రూ.35,50,000 బడ్జెట్ అవసరమని తెలిపారు. ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ వసతి గృహాల్లో తాగునీటి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యురాలు పుణ్యవంతుల రజనీ మాట్లాడుతూ వసతి గృహాల్లో బాలికలు విద్యపై దృష్టి పెట్టేలా సంక్షేమ శాఖ అధికారులు పర్యవేక్షించాలన్నారు. జిల్లా అదనపు ఎస్పీ ప్రసాద్, ఆర్డీఓలు పి.శ్రీకర్, దేవరకొండ అఖిల పాల్గొన్నారు.
వచ్చే పండగలను శాంతియుతంగా నిర్వహించుకునేలా అధికారులు పర్యవేక్షించాలని జిల్లా రెవెన్యూ అధికారి కొత్త మాధవి సూచించారు. కలెక్టరేట్‌లో ఉత్సవాల నిర్వహణ శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ నెల 25న క్రిస్మస్, 30న ముక్కోటి ఏకాదశి, జనవరిలో సంక్రాంతి పండగలు, 31న శని త్రయోదశికి మందపల్లి శనైశ్చరుని ఆలయంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. జనవరి 25 నుంచి ఫిబ్రవరి రెండో తేదీ వరకూ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి తిరు కల్యాణోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలన్నారు.


