ఇదేం బ్యాగోతం.. | - | Sakshi
Sakshi News home page

ఇదేం బ్యాగోతం..

Dec 13 2025 7:58 AM | Updated on Dec 13 2025 7:58 AM

ఇదేం

ఇదేం బ్యాగోతం..

చిరిగిపోతున్న స్కూల్‌ బ్యాగ్‌లు

చంద్రబాబు సర్కారు

నిర్వాకమే కారణం

జిల్లాలో 91,078 మంది

విద్యార్థులకు కిట్‌ల పంపిణీ

ఇచ్చిన రెండు నెలలకే పాడైన బ్యాగులు

సాక్షి, అమలాపురం: చంద్రబాబు సర్కారు ‘బ్యాగో’తం బయటపడింది.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాసిరకం పుస్తకాల సంచులు ఇవ్వడంతో అవినీతి బయట పడుతోంది.. పేద విద్యార్థులపై సర్కారుకు ఉన్న ప్రేమేంటో చెప్పకనే అర్థమవుతోంది.. చంద్రబాబు ప్రభుత్వంలో కోటలు దాటే మాటలకు చేస్తున్న పనులకు పొంతన లేకుండా పోతోందనడానికి ఇదే నిదర్శనం. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం కన్నా మెరుగైన, మేలైన విద్య అందిస్తామని చెప్పుకొచ్చిన ‘కూటమి’ పథకాలకు పేర్లు మార్చడం తప్ప కొత్తగా చేసింది ఏమీ లేదు. సరికదా పాఠశాలల్లో ఉన్న వసతులకు మంగళం పాడుతోంది. విద్యార్థులకు అందించే కిట్లు, ఇతర సదుపాయాల కల్పనలో డొల్లతనం బయటపడుతోంది.

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించడానికి అమలు చేసిన సీబీఎస్‌ఈ విధానం, ట్యాబ్‌ల పంపిణీ, డిజిటల్‌ విద్య వంటి బృహత్తర కార్యక్రమాలకు చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గ్రహణం పట్టించింది. అలాగే మధ్యాహ్న భోజన పథకానికి పెరిగిన ధరలకు అనుగుణంగా సొమ్ము పెంచపోవడం వల్ల ఇంప్లిమెంట్‌ ఏజెన్సీలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఇక ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యామిత్ర పథకంలో అందించిన విద్యా కిట్లలో నాణ్యత గుట్టురట్టవుతోంది. కిట్లలో బ్యాగ్‌లు, షూలు, యూనిఫామ్‌, బెల్టులు వంటి వస్తువులు నాసిరకంగా ఉన్నాయి. దీనితో వాటి గట్టు ఇప్పుడు బయట పడుతోంది. జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్‌ఆర్‌కేవీఎం కిట్లు పంపిణీ చేశారు. ఈ కిట్లలో 91,078 మందికి యూనిఫామ్స్‌, 60,401 మందికి బెల్టులు, 91,078 మందికి స్కూల్‌ బ్యాగులు, 90,418 మందికి షూస్‌, 7,936 మందికి ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలు, 6,28,458 మందికి నోట్‌బుక్స్‌ అందించారు.

కొత్తవీ అదే తంతు

స్కూల్‌ బ్యాగ్‌లు నాసిరకంగా ఉండడంతో విద్యార్థులకు ఇచ్చిన రెండు నెలలకే అవి చిరిగిపోవడం ప్రారంభించాయి. బ్యాగులు చిరిగిపోవడంతోపాటు వాటి జిప్‌లు పనిచేయకుండా ఉన్నాయి. బ్యాగ్‌లు వీపునకు తగిలించుకునే తాళ్లు కూడా తెగిపోవడంతో వాటిని విద్యార్థులు చేతులతో మోసుకెళ్లాల్సి వస్తోంది. పుస్తకాలు ఎక్కువగా పెట్టుకుంటే బ్యాగ్‌లు మొత్తం చిరిగిపోతున్నాయి. ప్రభుత్వం వీటిపై నిర్వహించి ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో విద్యార్థుల తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలిపారు. దీనికి తోడు పేరెంట్స్‌ కమిటీ మీటింగ్‌ (పీటీఎం)లలో తల్లిదండ్రు లు ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులపై విరుచుకుపడ్డారు. జిల్లాలో పలు పాఠశాలలో ఇదే పరిస్థితి ఉంది. బ్యాగ్‌లు నాసిరకంగా ఉన్న విషయం బయట పడడంతో అల్లరయ్యే అవకాశముందని గుర్తించిన వి ద్యాశాఖ పాడైన బ్యాగ్‌ల స్థానంలో కొత్తవి అందిస్తా మని చెబుతోంది. ఇలా జిల్లాలో కేవలం 2,431 మందికి కొత్త స్కూల్‌ బ్యాగ్‌లను అందించారు. కొత్తగా అందించిన బ్యాగ్‌లు కూడా నాసిరకంగా ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అవాక్కవుతున్నారు.

ఇంకా ఉన్నా..

ఇంకా జిల్లాలో పలువురు విద్యార్థులు నాణ్యత లేని స్కూల్‌ బ్యాగ్‌లతో ఇబ్బందులు పడుతున్నారు. కొంద రు విద్యార్థులు చిరిగిపోయిన బ్యాగ్‌లు ఉపయోగించడానికి వీలు కాకపోవడంతో మార్కెట్‌లో కొత్తవి కొను క్కుని వాడుకుంటున్నారు. వీటితోపాటు ప్రభుత్వం ఇచ్చిన షూస్‌ కూడా నాణ్యత లేక ఉపయోగించడానికి వీలు లేకుండా ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు.

గతమెంతో ఘనం

గత ప్రభుత్వంలో జగనన్న విద్యా కానుక రూపంలో నాణ్యమైన బ్యాగ్‌లు, షూలు, యూనిఫామ్‌ అందించేవారు. పైగా పాఠశాలలు తెరిచేందుకు రెండు నెలల ముందే వీటిని ఇచ్చేవారు. వీటికి నాణ్యత లేదని నాడు విమర్శలు గుప్పించడంతో పాటు సోషల్‌ మీడియాలో నానాయాగీ చేసిన టీడీపీ అధికారంలోకి వచ్చిన తరు వాత తన అనుయాయులకు స్కూల్‌ కిట్‌ల పంపిణీ కాంట్రాక్ట్‌ అప్పగించింది. వారు చేసిన కక్కుర్తి పని వల్ల విద్యా సంవత్సరం మధ్యలోనే విద్యార్థుల బ్యాగ్‌లు, కిట్‌లోని ఇతర వస్తువులు పనికి రాకుండా పోతున్నాయి.

నాణ్యత లేకే పాడయ్యాయి..

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యా మిత్ర పథకంలో అందించిన స్కూల్‌ బ్యాగులు, షూలు నాణ్యతగా లేవు. ప్రభుత్వం అందించిన స్కూల్‌ బ్యాగులు రోజుల్లోనే చిరిగిపోతున్నాయి. షూలు నాణ్యత లేకపోవడం, సరైన సైజులు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. భావిభారత పౌరులకు ప్రభుత్వం మంచి కిట్లు అందించి ప్రోత్సహించాలి.

– రేవు తిరుపతిరావు, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అమలాపురం

ఇదేం బ్యాగోతం..1
1/3

ఇదేం బ్యాగోతం..

ఇదేం బ్యాగోతం..2
2/3

ఇదేం బ్యాగోతం..

ఇదేం బ్యాగోతం..3
3/3

ఇదేం బ్యాగోతం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement