భారతాధ్యయనంతో పంచభూతాల అనుగ్రహం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): భారతాధ్యయనంతో పంచభూతాల అనుగ్రహం కలుగుతుందని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో వ్యాస భారత ప్రవచనాన్ని ఆయన శుక్రవారం కొనసాగించారు. ‘ఖాండవ వనదహన సమయంలో భారతంలో అనే అగ్ని స్తుతులు కనబడతాయి. ఇవి వేదాల్లోని అగ్నిసూక్త మంత్రాల వంటివే. అగ్ని స్తుతి అత్యంత విశేషమైనది. సర్వదేవతలూ అగ్ని స్వరూపులే. వేదాల్లోని అగ్నిసూక్తం అందరూ చదవలేరు. కానీ, భారతంలోని అగ్నిస్తుతి శ్లోకాలు తప్పులు లేకుండా అందరూ చదవవచ్చు. దీనివలన పంచభూతాలు శాంతిస్తాయి. వాటి అనుగ్రహం కలుగుతుంది’ అని అన్నారు. భారత కథలోకి వెళ్తూ.. ‘ద్వారకకు వెళ్తున్న శ్రీకృష్ణుడిని పాండవులు కొంత దూరం అనుసరించారు. ధర్మరాజు రథసారథి అయ్యాడు. అర్జునుడు రథంలో మాధవునికి వింజామరలు వీచాడు. రథంతో పాటు పాండవుల హృదయాలు కూడా కృష్ణుని అనుసరించి వెళ్లాయి’ అని చెప్పారు. ప్రవచనాలు ప్రారంభించిన పదహారో రోజు కావడంతో.. సభా పర్వంలోకి ప్రవేశించడాన్ని 16 రోజుల పండగగా అభివర్ణించారు. ‘మయుడు ధర్మరాజుకు నిర్మించిన దివ్యమైన సభకు త్రిలోక సంచారి నారదుడు వచ్చి, అనేక రాజధర్మాలు చెప్పాడు. రామాయణంలో తనను అయోధ్యకు తీసుకువెళ్లడానికి వచ్చిన భరతునికి శ్రీరాముడు చెప్పిన రాజధర్మాలతో నారదుడు చెప్పిన ధర్మాలు సరితూగుతాయి. వ్యాసునికి వాల్మీకి అంటే మహాప్రీతి. నారదుడు ఇంద్ర, యమ, వరుణ, కుబేర, బ్రహ్మ సభలను వర్ణించాడు’ అని సామవేదం వివరించారు. దేవలోకంలో ఉన్న పాండురాజు రాజసూయ యాగం చేయాలని తన ద్వారా సందేశం పంపాడని ధర్మరాజుకు నారదుడు చెబుతాడన్నారు. కానీ, ఈ యాగం వలన గొప్ప ప్రజాక్షయం జరుగుతుందని చెప్పారు. యమసభను వర్ణిస్తూ, యముడు సహజంగా సౌమ్యుడు, శాంతస్వరూపుడు, పాపుల పాలిట భయంకరుడని అన్నారు. ధర్మరాజు పాలనలో ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని, రాజసూయ యాగం చేయాలంటూ ధర్మరాజును ఎందరో ప్రోత్సహించారని దీనికి సంకల్పం చేయాలని మంత్రులు, హితైషులు సూచించారని తెలిపారు. ‘ఎందరు చెప్పినా, ధర్మరాజుకు కృష్ణుడు చెప్తేనే తృప్తి. ఆయన ఆదేశం మేరకు నడుచుకోవాలని నిర్ణయించాడు. వేగంగా వెళ్లి కృష్ణుని వేగంగా తీసుకురావడానికి పంపాడు. లోకంలో ఎందరో ఎన్నో రకాల సలహాలు ఇస్తూంటారు. కానీ, నాకు ఏది మంచిదో అదే నీవు ఉపదేశిస్తావని ధర్మరాజు కృష్ణునితో అంటాడు. రాజసూయ యాగం చేయడానికి పగవారు ఉండరాదని చెబుతాడు. చివరకు కృష్ణుని సలహాపై ఆ యాగం చేయడానికి ధర్మరాజు సిద్ధపడ్డాడు’ అని సామవేదం చెప్పారు.


