అంకితభావంతో పనిచేస్తే తప్పక గుర్తింపు
ముమ్మిడివరం: అంకిత భావంతో విధులు నిర్వర్తించే ప్రతి ఉద్యోగికీ గుర్తింపు లభిస్తుందని జిల్లా రవాణాశాఖాధికారి దేవిశెట్టి శ్రీనివాస్, జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారి దుర్గారావు దొర అన్నారు. బదిలీపై వెళ్తున్న డీఈవో షేక్ సలీం బాషాకు బుధవారం ముమ్మిడివరం ఎయిమ్స్ కళాశాలలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. డీఈఓ కార్యాలయ ఏడీ నక్కా సురేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీటీసీ శ్రీనివాస్, డీఎంహెచ్‌వో దుర్గారావు దొర మాట్లాడుతూ విధి నిర్వహణను ప్రథమ కర్తవ్యంగా భావించే ఉద్యోగులు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదిస్తారన్నారు. అలాంటి వారిలో డీఈవో సలీం బాషా ప్రథమస్థానంలో నిలుస్తారన్నారు. డీసీఈబీ సెక్రటరీ బి.హనుమంతరావు, ఉపవిద్యాశాఖాధికారులు పి.రామలక్ష్మణమూర్తి, గుబ్బల సూర్యప్రకాశరావు, జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం, సమగ్ర శిక్షా ఏఎంవో పి.రాంబాబు తదితరులు డీఈవో బాషా సేవలను కొనియా డారు. అనంతరం ఆయనను ఘనంగా సత్కరించారు. జిల్లాలో వివిధ పాఠశాలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నర్సింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
● జీజీహెచ్‌లో చికిత్స అందిస్తున్న వైద్యులు
● ప్రిన్సిపాల్ బెదిరింపులే కారణమని పోలీసులకు వాంగ్మూలం
కాకినాడ క్రైం: జీజీహెచ్‌లోని నర్సింగ్ స్కూల్లో చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడి ప్రభుత్వ వసతి గృహంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలివీ.. కాకినాడ అశోక్ నగర్‌కు చెందిన కర్రి ధర్మతేజ అనే 23 ఏళ్ల విద్యార్థి జీజీహెచ్ నర్సింగ్ స్కూల్లో జీఎన్‌ఎం రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం హాస్టల్‌లోని తన గదిలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే ఉన్న సహ విద్యార్థులు అతడిని జీజీహెచ్‌లోని అత్యవసర విభాగానికి తరలించారు. అక్కడి ఐసీయూ ఏఎంసీయూ–1లో ధర్మతేజకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
కేసు నమోదు
విషయం తెలుసుకున్న కాకినాడ వన్ టౌన్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. ఆస్పత్రిలో ధర్మతేజకు వద్దకు వెళ్లి వాంగూల్మం తీసుకున్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ అన్నే విమల తనను కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేయిస్తున్నారని, చేయకపోతే పరీక్షల మార్కులు తన చేతిలో ఉంటాయి జాగ్రత్త అని బెదిరించారని వాపోయాడు. తన భవిష్యత్తును ఏం చేస్తారోనన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డానని తెలిపాడు. ఆపరేటర్‌గా పనిచేయిస్తుండడం వల్ల చదువు దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశాడు. నవంబర్‌లో కొన్ని కంప్యూటర్ పరికరాలు పోతే తనను ప్రిన్సిపాల్ ప్రశ్నించారని, తాను బాధ్యుడ్ని కాదని చెప్పానన్నాడు. తాను ఎందుకు పనిచేయాలని ప్రిన్సిపాల్‌ని ప్రశ్నించానని, అందుకు ఆమె ‘నాకే ఎదురు చెబుతావా, నీ పరీక్షల మార్కులు నా చేతిలో ఉంటాయి, నాకు తెలుసు ఏం చేయాలో’ అన్నారని వాపోయాడు. ప్రిన్సిపాల్ చేతిలో తన భవిష్యత్తు ఏమైపోతుందోనన్న ఆవేదనతో ఆత్మహత్యకు యత్నించినట్లు ధర్మతేజ తెలిపాడు.


