మొక్కుబడి సమావేశాలు
సాక్షి, అమలాపురం: చేసేది మూరెడు.. ప్రచారం బారెడు.. ఇది చంద్రబాబు మార్కు పరిపాలన. బాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావొస్తున్నా విద్యా వ్యవస్థను గాడిలో పెట్టలేదు. బడాయి మాటలు.. డాబు కబుర్లతో కాలక్షేపం చేస్తోంది. గత ప్రభుత్వం సర్కారు బడులకు కార్పొరేట్ స్థాయి వసతులు కల్పిస్తే, ప్రస్తుత ప్రభుత్వం కార్పొరేట్‌కు అప్పగించాలని చూస్తోంది. ఇదే సమయంలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ అంటూ చేసింది ఏమీ లేకున్నా భారీ ప్రచారానికి మాత్రం తెరదీసింది.
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించడానికి సీబీఎస్‌ఈ విధానం, ట్యాబ్‌ల పంపిణీ, డిజిటల్ విద్య వంటి బృహత్తర కార్యక్రమాలను చేపట్టింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వీటికి మంగళం పాడింది. స్కూళ్లలో ఎదురవుతున్న సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు బాబు ప్రభుత్వం శుక్రవారం మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశాల పేరిట హంగూ, ఆర్భాటానికి తెరలేపింది. అయితే అరకొరగా నిధులు విదిల్చి చేసిన ఏర్పాట్లతో పలుచోట్ల సమావేశాలు మమ అనింపిచారు. గతేడాది డిసెంబర్ 10న మొదటిసారిగా మెగా పీటీఎంను కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ఏడాది జూలై 7న మెగా పేటీఎం 2.0 పేరిట నిర్వహించారు. ఈ ఏడాది జూలైలో నిర్వహించిన మెగా పీటీఎం సందర్భంగా తల్లులకు రంగవల్లుల, తండ్రులకు టగ్ ఆఫ్ వార్ పోటీలతో పాటు, తల్లిదండ్రులకు పాద పూజలు, మొక్కలు నాటే కార్యక్రమం చేశారు. శుక్రవారం నిర్వహించిన మెగా పేటీఎం 3.0 సమావేశానికి అరకొర కేటాయింపులతో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్లు పలుచోట్ల మొక్కుబడి తంతుగానే సాగాయి. తల్లిదండ్రుల హాజరు కూడా అంతంత మాత్రమే కావడంతో సమావేశాలు వెలవెలబోయాయి. పిల్లల విద్యా ప్రమాణాలు తల్లిదండ్రులకు తెలియజేయడం, వారి విద్యాభివృద్ధి లక్ష్యంగా జిల్లాలో పీటీఎంలు నిర్వహించారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో నిర్వహించగా, ప్రస్తుతం అందుకు భిన్నంగా కేవలం ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మాత్రమే చేపట్టారు. పేరెంట్స్‌కు ఆటల పోటీలు, పాదపూజలు, మొక్కల పంపిణీ లేకుండానే మమ అనిపించారు. ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి సరైన స్పందన లేకపోవడం, పేరెంట్స్‌కు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడం, మొక్కల పంపిణీ ఖర్చుతో కూడుకున్నవి కావడంతో ఈ విడతలో వాటిని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది.
అంతంత మాత్రంగానే హాజరు
మెగా పీటీఎం సమావేశాలకు తల్లిదండ్రులు నూరు శాతం హాజరయ్యే విధంగా చూడాలని ఉన్నతాధికారులు ఆదేశించగా, చాలాచోట్ల 50 శాతం మంది కూడా హాజరుకాని పరిస్థితి ఉంది. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడి వారి పిల్లల విద్యా ప్రమాణాలు తెలియజేయడం, విద్యా సామగ్రి, బోధనా పరికరాలు, ఇతర సదుపాయాలపై అవగాహన కల్పించాలన్నది లక్ష్యం. పాఠశాలల్లోని సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను పక్కనపెట్టి కూటమి నేతలు ఉపన్యాసాలకే పరిమితమయ్యారు. ప్రస్తుతం పనుల రోజులు కావడంతో తల్లిదండ్రులు సమావేశాలకు రావడానికి విముఖత వ్యక్తం చేశారు. ఇందుకు ఉదాహరణ గత ఏడాది అంబాజీపేట ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పీటీఎం సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులకు భోజనాలు సరిపోలేదు. ఈ ఏడాది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విద్యార్థులు తల్లిదండ్రులు పెద్దగా రాలేదు. అమలాపురం మండలం ఈదరపల్లిలో కూడా సగం మంది తల్లిదండ్రులు కూడా హాజరు కాలేదు. బండారులంకలో విద్యార్థుల తల్లిదండ్రులకు భోజనాలు సరిపోలేదు. చాలా పాఠశాలలకు గత ఏడాది ఖర్చు చేసిన భోజనాలకు సంబంధించి బిల్లులు ఇంకా రాకపోవడం గమనార్హం.
అరకొర కేటాయింపులు
పండగ వాతావరణంలో పీటీఎం నిర్వహించాలని, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులను సాదరంగా కార్యక్రమానికి ఆహ్వానించాలని, విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులకు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ సూచించింది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు 1,583కు గాను మెగా పీటీఎం నిర్వహణకు కేవలం రూ.29.42 లక్షలు విడుదల చేశారు. 30 మంది లోపు విద్యార్థులున్న పాఠశాలలకు రూ.900 కేటాయించగా, 31 మంది నుంచి 100లోపు విద్యార్థులున్న పాఠశాలలకు రూ.2,250లు, 101 మంది నుంచి 250 లోపు విద్యార్థులు ఉంటే రూ.4,500లు, 251 నుంచి వెయ్యి లోపు ఉంటే రూ.6,750, వెయ్యి మందికి పైబడి విద్యార్థులు ఉంటే రూ.తొమ్మిది వేలు ఇచ్చారు. జిల్లాలో 30 లోపు విద్యార్థులున్న పాఠశాలలు 1,062 ఉండగా, 31కు పైబడి 100లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు 278, అలాగే 101కు పైబడి 250 లోపు విద్యార్థులున్న పాఠశాలలు 124 ఉండగా, 251కు పైబడి 1,000 మంది విద్యార్థుల లోపు ఉన్న పాఠశాలలు 119 ఉన్నాయి. వెయ్యి మందికి పైబడి విద్యార్థులున్న పాఠశాల ఒకటీ లేదు.
ఖర్చులు తడిసి మోపెడు
పాఠశాలల్లో మెగా పీటీఎం కోసం చేసిన ఖర్చులు ప్రధానోపాధ్యాయులకు తడిసి మోపైడెనట్లు పలువురు వాపోయారు. టెంట్లు, కుర్చీలు, వంట సామగ్రి, పూల దండలు, బొకేలు, బిస్కెట్లు తదితర ఖర్చులకు అక్కడి పరిస్థితులను బట్టి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకూ అయినట్టు సమాచారం. ప్రభుత్వం మంజూరు చేసిన అరకొర కేటాయింపులు సరిపడని పరిస్థితుల్లో పలుచోట్ల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అదనంగా చేతి డబ్బులు వేసుకున్నట్లు తెలిసింది.
·˘ Ððl$V> ï³sîæ-G…MýS$ AÆý‡-MöÆý‡ HÆ>µr$Ï
·˘ hÌêÏMýS$ MóSÐ]lÌS…
రూ.29.42 లక్షల కేటాయింపు
·˘ ™èlÍÏ-§ýl…-{yýl$ÌSMýS$
కానరాని ఆటల పోటీలు


