జీతాలు పెంచాలని వినతి
మలికిపురం: జీతాలు పెంచాలని కోరుతూ ఎంఈఓ ఎం.విజయశ్రీకి సమగ్ర శిక్ష క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్స్ (సీఆర్‌ఎంటీ ఫెడరేషన్) జిల్లా అధ్యక్షుడు వి.రామకృష్ణ ఆధ్వర్యంలో సీఆర్‌ఎంటీలు వినతి పత్రం సమర్పించారు. ఈ మేరకు మలికిపురం ఎంఈఓ కార్యాలయంలో ఆమెను కలసి తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. సీఆర్‌ఎంటీలుగా విద్యా శాఖలో చేరి 14 ఏళ్లు అవుతుందని, అయితే తమ జీతాల్లో ఎటువంటి మార్పు లేదన్నారు. ప్రస్తుత తరుణంలో ధరలు విపరీతంగా పెరగడంతో ఇంటి అద్దెలు కట్టలేక, పిల్లలను చదివించుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తక్షణమే హెచ్‌ఆర్ పాలసీ అమలు చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
అన్నదాన ట్రస్ట్‌కు
విరాళాల సమర్పణ
రామచంద్రపురం రూరల్: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయ అన్నదాన ట్రస్ట్‌కు ద్రాక్షారామకు చెందిన దాతలు యనమండ్ర భీమశంకరం, మాణిక్యాంబ దంపతులు శుక్రవారం రూ. లక్ష విరాళంగా అందజేశారు. అదే విధంగా దర్బ సూర్య సుబ్రహ్మణ్యం రూ. 50 వేలు సమర్పించారు. దాతలకు ఆలయ ఈఓ, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని స్వామివారి తీర్థప్రసాదాలు, జ్ఞాపికలను అందజేశారు.
వైఎస్సార్ సీపీ
కమిటీల్లో స్థానం
సాక్షి, అమలాపురం: వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా కమిటీల్లో జిల్లాకు చెందిన పలువురికి అవకాశం దక్కింది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వీరిని నియమించారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు వచ్చాయి. రాష్ట్ర బూత్ కమిటీల వింగ్ జాయింట్ సెక్రటరీగా కాజులూరి వెంకట సుబ్బిరెడ్డి (రామచంద్రపురం), జిల్లా వైఎస్సార్‌టీఎఫ్ విభాగం అధ్యక్షుడిగా రేవు నాగేశ్వరరావు (ముమ్మిడివరం), నియోజకవర్గ వైఎస్సార్‌టీఎఫ్ అధ్యక్షులుగా పులిదిండి ప్రకాశం (కొత్తపేట), పోతు శ్రీనివాస్ (రామచంద్రపురం), బల్లా శ్రీనివాస్ (రాజోలు), ముక్కపాటి చిన్నబాబు (మండపేట), పెచ్చెట్టి రాంబాబు (పి.గన్నవరం), కేత సూరిబాబు (అమలాపురం)లను నియమించారు.
ర్యాంకు మెరుగుపడాలి
అన్నవరం: సత్యదేవుని భక్తులకు మెరుగైన సేవలు అందిస్తూ రాష్ట్ర స్థాయిలో ర్యాంకును మెరుగు పరచుకోవాలని అన్నవరం దేవస్థానం సిబ్బందికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సూచించారు. కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఆయన సత్యదేవుని దర్శించి, పూజలు చేశారు. అనంతరం, దేవస్థానం అధికారులతో మాట్లాడుతూ, అన్నదానం హాలు వద్ద అదనంగా మరో షెడ్డు వేయాలని సూచించారు. పలు కీలక ప్రదేశాల్లో 30 టాయిలెట్లు నిర్మించాలన్నారు. దేవస్థానంలో ప్రసాద్ స్కీం నిర్మాణాలను పది నెలల్లో పూర్తి చేస్తామని ఆ విభాగం అధికారులు కలెక్టర్ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
సీఎస్ ఆదేశాలతో..
రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాల్లో సేవలపై నవంబర్ నెలలో ఐవీఆర్‌ఎస్ ద్వారా సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో 67.8 శాతంతో అన్నవరం దేవస్థానం ఆరో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో అన్ని దేవస్థానాల ఈఓలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ మంగళవారం విజయవాడలో సమీక్షించారు. ఆయన ఆదేశాల మేరకు కలెక్టర్ షణ్మోహన్ అన్నవరం దేవస్థానం ఈఓ, ఇతర అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం, కలెక్టర్ స్వయంగా సమీక్షిస్తారనే సమాచారం అందడంతో శుక్రవారం ఉదయం నుంచీ దేవస్థానంలోని వివిధ విభాగాల సిబ్బంది ఫైల్స్ సిద్ధం చేసుకుని ఎదురు చూశారు. గత ఏప్రిల్‌లో అన్నవరం దేవస్థానానికి ఏడో ర్యాంకు వచ్చినపుడు కలెక్టర్ దేవస్థానానికి వచ్చి, అన్ని విభాగాలూ పరిశీలించి సిబ్బందికి ఆదేశాలిచ్చారు. ఇప్పుడు కూడా అలాగే చేస్తారని భావించగా, ఆయన సాయంత్రం వచ్చి, అరగంటలోనే వెళ్లిపోయారు. దీంతో, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
జీతాలు పెంచాలని వినతి


