లావాదేవీలు జరగని ఖాతాల్లో సొమ్ము పొందవచ్చు
అమలాపురం రూరల్: మీ డబ్బు.. మీ హక్కు కార్యక్రమంలో భాగంగా పదేళ్ల పైబడి నిరుపయోగంగా ఉన్న బ్యాంక్ ఖాతాల్లో ఇన్సూరెన్స్, షేర్ మార్కెట్లో ఉన్న సొమ్మును తిరిగి హక్కుదారులు పొందవచ్చని ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ అశోక్ నాగరాజన్ తెలిపారు. శుక్రవారం అమలాపురం కలెక్టర్ గోదావరి భవన్‌లో బ్యాంకర్లు, ఇన్సూరెన్స్, షేర్ మార్కెట్ కంపెనీ ప్రతినిధులతో ఎల్‌డీఎం కేశవవర్మ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రీజినల్ మేనేజర్ మాట్లాడుతూ ప్రజలు మర్చిపోయిన లేదా క్లెయిమ్ చేయని బ్యాంక్ డిపాజిట్లు, బీమా పాలసీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఆర్థిక ఆస్తులను తిరిగి పొందేలా సహాయం చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టిందన్నారు. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ కేశవవర్మ మాట్లాడుతూ లావాదేవీలు జరగని బ్యాంకు ఖాతాల్లో సొమ్ము ఇచ్చే ప్రయత్నం చేయాలని కేంద్రం ఆదేశించిందన్నారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా 4,70,690 నిరుపయోగంగా ఉన్న బ్యాంకు ఖాతాల్లో రూ 82.66 కోట్ల మేర నిధులు ఉన్నట్లు గుర్తించామన్నారు. సరైన పత్రాలు తీసుకొచ్చి సొమ్ము తీసుకువెళ్లాలని అన్నారు.


