అన్నవరం.. భక్తజన సాగరం | - | Sakshi
Sakshi News home page

అన్నవరం.. భక్తజన సాగరం

Nov 17 2025 8:42 AM | Updated on Nov 17 2025 8:42 AM

అన్నవ

అన్నవరం.. భక్తజన సాగరం

సత్యదేవుని సన్నిధికి పోటెత్తిన భక్తులు

వరుసగా రెండో రోజూ

లక్ష మందికి పైగా రాక

10,523 వ్రతాల నిర్వహణ

అన్నవరం: పవిత్ర కార్తిక మాసం మరో నాలుగు రోజుల్లో ముగియనుండటంతో సత్యదేవుని ఆలయానికి భక్తులు లక్షలాదిగా పోటెత్తుతున్నారు. ఏకాదశి పర్వదినం కావడంతో శనివారం 1.20 లక్షల మంది భక్తులు రత్నగిరికి వచ్చిన విషయం తెలిసిందే. అదే ఒరవడిలో ఆదివారం కూడా లక్ష మందికి పైగా భక్తులు రావడంతో అన్నవరం భక్తజనసాగరాన్ని తలపించింది. శనివారం రాత్రి నుంచే రత్నగిరికి భక్తజన ప్రవాహం మొదలైంది. ఇసుకేస్తే రాలని రీతిలో వేలాది వాహనాల్లో వెల్లువెత్తిన భక్తులతో ఆదివారం సాయంత్రం వరకూ ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. సత్యగిరిపై హరిహర సదన్‌ ముందు పార్కింగ్‌ స్థలం, సత్యగిరి రోడ్లు, మల్టీ లెవెల్‌ పార్కింగ్‌ స్థలాలు భక్తుల వాహనాలతో నిండిపోయాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో తూర్పు రాజగోపురం నుంచి పశ్చిమ రాజగోపురం వరకూ క్యూ లైన్లు, ఆలయ ప్రాంగణం భక్తులత నిండిపోయింది. ఒక దశలో భక్తులు నడవడానికి ఏమాత్రం వీలు లేని పరిస్థితి ఏర్పడింది. వ్రత, నిత్య కల్యాణ, పాత కల్యాణ మండపాలన్నీ వ్రతాలాచరించే భక్తులతో నిండిపోయాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి సుమారు 4 గంటల సమయం పట్టింది. మధ్యాహ్నం 3 గంటల వరకూ అంతరాలయ, యంత్రాలయ దర్శనాలను నిలిపివేశారు. వేకువజామున 2 గంటల నుంచే భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. తూర్పు రాజగోపురం ఎదురుగా, ఆలయ ప్రాంగణంలో, ధ్వజస్తంభం వద్ద ఏర్పాటు చేసిన ర్యాకులలో భక్తులు దీపారాధనలు చేశారు. దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌ ఉదయం నుంచీ ఆలయం వద్దనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈఓ వీర్ల సుబ్బారావు మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం వద్ద కొంతసేపు క్యూ లైన్లలో భక్తులను నడిపించారు. సిబ్బందికి సూచనలిచ్చారు. సుమారు 20 వేల మంది భక్తులకు పులిహోర, దధ్యోదనం, చిన్న పిల్లలకు పాలు పంపిణీ చేశారు.

1,25,600కు చేరిన వ్రతాలు

సత్యదేవుని వ్రతాలు ఆదివారం 10,523 జరిగాయి. శనివారం జరిగిన 11,650 వాటితో కూడా కలిపితే ఈ రెండు రోజుల్లోనే 22,173 వ్రతాలు జరిగినట్లయింది. గత ఏడాది కార్తికంలో ఇదే సమయానికి 1,29,636 వ్రతాలు జరగగా.. ఈ కార్తికంలో ఇప్పటి వరకూ 1,25,600 జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే 4 వేల వ్రతాలు మాత్రమే తక్కువగా ఉన్నాయి. గత ఏడాది కార్తిక మాసం మొత్తం 1.47 లక్షల వ్రతాలు జరిగాయి. దీనిని అధిగమించాలంటే కార్తికంలో మిగిలిన నాలుగు రోజుల్లో మరో 22 వేల వ్రతాలు జరగాల్సి ఉంటుంది. సోమవారం కూడా కనీసం 10 వేల వ్రతాలు జరిగితే ఆ సంఖ్యను అధిగమించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

రూ.1.10 కోట్ల ఆదాయం

ఆదివారం వచ్చిన భక్తుల ద్వారా దేవస్థానానికి రూ.1.10 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో వ్రతాల ద్వారానే సుమారు రూ.65 లక్షలు, ప్రసాద విక్రయాల ద్వారా రూ.30 లక్షలు, ఇతర విభాగాల ద్వారా రూ.15 లక్షలు వచ్చింది.

నేడు కూడా రద్దీ

కార్తిక మాసంలో చివరి సోమవారం కావడంతో సత్యదేవుని సన్నిధికి నేడు కూడా సుమారు లక్ష మంది భక్తులు వచ్చే అవకాశముంటుందని అధికారులు భావిస్తున్నారు. ఆ తరువాత మూడు రోజులూ పెద్దగా రద్దీ ఉండదు. ఈ ఒక్క రోజు సాఫీగా గడచిపోతే చాలని అధికారులు, సిబ్బంది కోరుకుంటున్నారు. ఇప్పటికే సత్రాల్లోని గదులను సిఫారసు లేఖలతో ప్రముఖుల బంధువులు తీసేసుకున్నారు. మిగిలిన గదులను దళారులు చేజిక్కించుకున్నారు. సామాన్య భక్తులకు కనీసం 20 శాతం గదులు కూడా లభించే అవకాశం లేదు. భక్తులు గదుల కోసం చూడకుండా డార్మెట్రీలను ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇక్కట్లు షరా మామూలే

రత్నగిరిపై భక్తులకు ఆదివారం కూడా ఇబ్బందులు తప్పలేదు. సత్యదేవుని దర్శనానికి సుమారు 4 గంటల పాటు క్యూలో నిలబడి ఉండాల్సి వచ్చింది. దీంతో స్వామివారి ఆలయానికి వచ్చే సమయానికి అందరూ నీరసపడిపోయారు.

భక్తుల లగేజీకి లాకర్లు చాలకపోవడంతో విశ్రాంతి షెడ్డులోనే ఉంచి, వాటికి భక్తులు కాపలా ఉన్నారు.

సత్యదేవుని దర్శనానంతరం భక్తులు వెలుపలకు వచ్చేందుకు ఒకే ఒక్క మార్గం ఉంచారు. 2023లో చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఈఓగా ఉన్నప్పుడు అగరువత్తులు విక్రయించే షాపు పక్క నుంచి 10 అడుగుల వెడల్పున మాత్రమే మెట్లు నిర్మించారు. అప్పట్లో ఇంతమంది భక్తులు వస్తారని ఊహించలేదు. వేలాది మంది భక్తులు ఈ మెట్ల మీద నుంచి వెళ్లడానికి ప్రయత్నిస్తూండటంతో తోపులాట జరుగుతోంది. ఈ మెట్ల దారిని మరింత వెడల్పు చేయడమో లేక తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న మెట్ల నుంచి భక్తులు దిగువకు వెళ్లేలా అనుమతించడమో చేయడం మేలు.

పశ్చిమ రాజగోపురం పక్కన ఉన్న గేటును మూసివేసి అటువైపు నుంచి భక్తుల రాకపోకలకు అనుమతించడం లేదు. దీని ద్వారా దివ్యాంగులు, వృద్ధులు, చిన్నారులతో ఉన్న మహిళలను అనుమతించాలి.

రూ.300 వ్రత మండపాలు ఆరు ఉన్నాయి. ఒక మండపం నిండాక మరో దానిలోకి భక్తులను అనుమతిస్తున్నారు. అయితే ఏ మండపంలోకి అనుమతిస్తారో తెలియక భక్తులు అన్ని మండపాల వద్దకూ పరుగులు పెట్టాల్సి వచ్చింది. కొన్ని మండపాల్లో వ్రతాలు జరుగుతున్నా అక్కడే క్యూలో ఉండిపోయారు తప్ప మరో మండపం వద్దకు వెళ్లలేకపోయారు. కనీసం పశ్చిమ రాజగోపురం లోపల ఏ వ్రత మండపం వద్దకు వెళ్లాలో మైకు ద్వారా ప్రకటించినా ఈ ఇబ్బంది తప్పేది.

సత్యదేవుని ఆలయ ప్రాంగణంలో చిన్న పిల్లలకు పాలిచ్చేందుకు ఎక్కడా మిల్క్‌ ఫీడింగ్‌ క్యాబిన్లు లేకపోవడంతో తల్లులు ఇబ్బందులు పడ్డారు.

దేవస్థానం బస్సులతో పాటు దాతలు సమకూర్చినవి కలిపి మొత్తం 16 బస్సులను రత్నగిరి, సత్యగిరి, రైల్వే స్టేషన్ల మధ్య నడిపారు. ఐదు నిమిషాలకో బస్సు నడిపినా చాలకపోవడంతో భక్తులు ఆటోలను ఆశ్రయించారు.

అన్నవరం.. భక్తజన సాగరం1
1/2

అన్నవరం.. భక్తజన సాగరం

అన్నవరం.. భక్తజన సాగరం2
2/2

అన్నవరం.. భక్తజన సాగరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement