అందానికో.. మంచుతునక | - | Sakshi
Sakshi News home page

అందానికో.. మంచుతునక

Nov 17 2025 8:42 AM | Updated on Nov 17 2025 8:42 AM

అందాన

అందానికో.. మంచుతునక

పొద్దున్నే బతుకు వేట

మంచు దుప్పటిని చీల్చుకుని వస్తున్న అరుణ కిరణాలు

హరిత సీమలో మైమరపిస్తున్న హిమ సౌందర్యం

సాక్షి, అమలాపురం: అందానికి ‘మంచు’తునకలా.. విరిసిన పచ్చదనంపై మంచు ముత్యాల్లా.. దారులు హిమసుమధారల్లా.. ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేసేలా.. పచ్చని కోనసీమను మంచు దుప్పటి కప్పుకుంటోంది. పసిడి కంకులతో కోతలకు సిద్ధమైన పైర్లను, కొబ్బరి, అరటి, పూల తోటలను ఉషోదయ వేళ మంచు కప్పేయడంతో కోనసీమ కొత్త అందాలను సంతరించుకుంటోంది. శీతాకాలంలో ఇలాంటి అందాలను చూడాలంటే అల్లూరి జిల్లా పాడేరు, అరకు, లంబసింగి, మారేడుమిల్లి వంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలని చాలామంది భావిస్తారు. అయితే కేరళను తలపించే ప్రకృతి అందాలతో తులతూగే కోనసీమ సైతం మంచు అందాలతో కట్టిపడేస్తోంది. సంక్రాంతి పండగ కన్నా ముందే రా.. రమ్మని స్వాగతం పలుకుతోంది.

ప్రకృతి పిలిచే.. మనసు దోచే

పసిడి పచ్చని వరి చేలు, గోదావరి నదీ పాయలపై పరచుకుంటున్న దట్టమైన మంచు తెరలు, కొబ్బరి చిగురుటాకులపై హిమ బిందువులు, వేకువ జామున ప్రసరించే భానుడి కిరణాలు, చల్లని గాలులు, తెల్లని మబ్బుల నీలాకాశం.. ఇలా ప్రతి ఒక్కటీ ప్రకృతి ప్రేమికుల మదిని దోచేవే. ఇలాంటి అపురూప దృశ్యాలు కోనసీమలో కోకొల్లలు.

నుదుట సిందూరం అద్దుకున్నట్టు

వణికించే చలి గాలులను చీల్చుకుని వస్తున్న నిలివెచ్చని సూర్య కిరణాలు కొబ్బరి చెట్ల మధ్య నుంచి భూమిని తాకుతున్న చిత్రం ప్రకృతి ప్రేమికుల మదిని దోచేస్తోంది. వర్షాకాలంలో అరుదుగా కనిపించే ఇంద్రధనస్సులు మంచు దుప్పటితో కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నాయి. మంచు తెరల నుంచి బయట పడుతున్న సమయంలో కోనసీమ సంప్రదాయ పెంకుటిల్లు కొత్త అందాలను సంతరించుకుంటున్నాయి. చెంతనే కొబ్బరి చెట్ల ఆకులపై నుంచి రాలే హిమ బిందువుల సోయగం ఎంత చూసినా తనివి తీరనిది. నుదుట సిందూరం అద్దుకుందా అన్నట్లు కనిపించే మంచు అందాలను మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. ఇటువంటి అందాలకు రాజోలు దీవి చిరునామా. వైనతేయ, వశిష్ట నదీపాయల మధ్య ఒదిగి ఉండే ఈ దీవి ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు.

తనివితీరా చూసేలా..

కోనసీమకు మరో వరం విశాలమైన సముద్రతీరం. మంచు తెరల మాటున ఎగసిపడే కెరటాలు, చెంతనే ఉన్న సరుగుడు తోటలు అపురూపమే. అంతర్వేది, కేశనపల్లి, ఎస్‌.యానాం, వాసాలతిప్ప, చిర్రయానాం తీరం.. వాటి వద్ద ఉన్న మొగలి పొదలు మైమరపిస్తాయి. చిట్టిపొట్టి చిట్టడవుల (మడ) మధ్య వేకువజామునే మంచు దుప్పటిని చీల్చుకుంటూ సాగే బోటు ప్రయాణాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. కాట్రేనికోన, అల్లవరంలో ఉండే ఈ మడ అడవుల అందాల అద్భుతమే.

స్వాగతం పలుకుతూ..

ప్రకృతి అందాలతో పాటు ఇక్కడి కార్మికుల శ్రమైక జీవన సౌందర్యం మరో అద్భుతం. గోదావరి.. సముద్ర తీరాల్లో తెలతెలవారకుండా మంచు పరదాల మాటున సాగే చేపల వేట.. పసిడి చేల మధ్య పనిచేసే కూలీలు.. ఇటుక బట్టీలలో కార్మికులు.. కొబ్బరి చెట్లు ఎక్కి దింపు తీసే శ్రమజీవులు.. సైకిళ్లపై అరటి గెలులు రవాణా చేసే రైతులు.. ఇలా చెప్పుకొంటూ పోతే తెల్లవారుజామున కార్మికుల జీవనం కూడా మంచు అందాలలో మంత్రముగ్ధులను చేస్తోంది. శీతాకాలం.. సంక్రాంతికి రెండు నెలల ముందే ఒకసారి కోనసీమ ‘రండి.. రండి.. దయచేయండి’ అని పర్యాటకులను, ప్రకృతి ప్రేమికులను పిలుస్తోంది.

ఫ కోనసీమకు ‘స్నో’యగం

ఫ మంత్రముగ్ధులను చేస్తున్న

ప్రకృతి రమణీయత

ఫ శీతాకాలంలో సరికొత్త సొబగులు

ఫ కొత్త హంగులు

అద్దుకున్న పచ్చని తోటలు

అందానికో.. మంచుతునక1
1/3

అందానికో.. మంచుతునక

అందానికో.. మంచుతునక2
2/3

అందానికో.. మంచుతునక

అందానికో.. మంచుతునక3
3/3

అందానికో.. మంచుతునక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement