గోవిందా.. హరి గోవిందా
మామిడికుదురు: గోవిందా.. హరి గోవిందా నామస్మరణతో అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామివారి ఆలయం ఆదివారం మార్మోగింది. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. పాత గుడితో పాటు కొత్త గుడి వద్ద స్వామివారి దర్శనం కోసం రద్దీ కనిపించింది. పవిత్ర కార్తిక మాసం, ఆపై ఆదివారం కావడంతో భక్తుల రాక పెరిగింది. ఏడుకొండల వాడా వెంకటరమణా గోవిందా, గోవింద అంటూ ఆ స్వామి వారిని కీర్తించారు. స్వామివారి సన్నిధిలో అమలాపురం మండలం ఇందుపల్లికి చెందిన శ్రీఅమృతేశ్వర నాట్య అకాడమీ వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఈ ఒక్కరోజు ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.4,64,181 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ఎం.సత్యనారాయణరాజు తెలిపారు. 6,800 మంది భక్తులు రాగా, ఐదు వేల మంది అన్న ప్రసాదం స్వీకరించారన్నారు. నిత్యాన్న ప్రసాద ట్రస్టుకు రూ.98,500 విరాళాలుగా సమర్పించారని తెలిపారు.


