రమణీయం.. నారసింహుని కల్యాణం
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనృసింహుని ఆలయంలో ఆదివారం ఆర్జీత సేవగా స్వామివారి శాంతి కల్యాణం బహుళ ద్వాదశి తిథి నాడు అర్చకులు ఘనంగా నిర్వహించారు. తొలుత ఆలయ కల్యాణ మండపంలోని ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. అనంతరం స్వామివారి శాంతి కల్యాణం ప్రారంభించారు. ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యాన స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, అర్చకులు ఈ కల్యాణాన్ని రమణీయంగా జరిపారు. పాల్గొన్న భక్తులకు స్వామి మూలవిరాట్ దర్శన భాగ్యాన్ని దేవస్థానం కల్పించింది. అలాగే లడ్డూ ప్రసాదం ఇచ్చి, అన్నదాన పథకంలో భోజన సౌకర్యం ఏర్పాటు చేసింది. అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్‌వీ ప్రసాద్ ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ పి.విజయ సారఽథి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే ఆలయంలో నిర్వహించిన శ్రీనారసింహ సుదర్శన హోమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. వేద పండితుడు చింతా వెంకటశాస్త్రి, అర్చకుడు రామకృష్ణమాచార్యులు వేదమంత్రాలతో హోమం నిర్వహించారు. హోమంలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.


