అయినవిల్లి: పార్వతి నందనా పాహిమాం.. అంటూ ఆ గణనాథుడిని భక్తజనం కొలిచింది. అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో రద్దీగా మారింది. ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామివారికి మేలుకొలుపు సేవ, వివిధ పూజలు చేశారు. స్వామిని ప్రత్యేక పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సాయంత్రం ఎనిమిది గంటలకు స్వామివారికి విశేష సేవలు చేసి ఆలయం తలుపులు మూసివేశారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 155 మంది, లక్ష్మీగణపతి హోమ పూజల్లో 24 మంది దంపతులు పాల్గొన్నారు. ఆరుగురు చిన్నారులకు అక్షరాభ్యాసాలు, ఏడుగురికి తులాభారం, ఇద్దరు చిన్నారులకు అన్నప్రాశన నిర్వహించారు. 53 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 6,325 మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ ఒక్కరోజే ఆలయానికి వివిధ విభాగాల ద్వారా రూ.4,40,153 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.
అన్నప్రసాద
పథకానికి విరాళాలు
కొత్తపేట: పురాణ ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి, గోపాలస్వామివారి క్షేత్రంలో అన్నప్రసాద పథకానికి భక్తులు విరివిగా విరాళాలు అందజేస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌కు చెందిన దండు వెంకట సత్యనారాయణరాజు, పద్మ దంపతులు రూ.25,116, దండు రాజ్‌గోపాలరాజు, వందన దంపతులు రూ.25,116, ఏలూరుకు చెందిన ఎం.తిరుమలాదేవి రమేష్ రూ.15 వేలు, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన రుచిత రూ.6,516, రావులపాలేనికి చెందిన పెన్మెత్స సిరిచందన రూ.5,116 అన్నప్రసాద పథకానికి విరాళాలుగా సమర్పించారు. దాతలకు పండితులతో వేదాశీర్వచనం చేయించి స్వామివారి చిత్రపటాలను దేవస్థానం ఈఓ భాగవతుల వెంకటరమణమూర్తి, సిబ్బంది, అర్చకులు అందించారు.
మహిళలకు స్పీకర్ అయ్యన్న
పాత్రుడు క్షమాపణ చెప్పాలి
ఐ.పోలవరం: రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ తెలుగు సంప్రదాయాలను మంట కలిపేలా ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడడం చాలా దారుణమని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కాశి మునికుమారి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగు సంప్రదాయాలకు ఎంతో విలువనిచ్చే ఏపీలో గోవా తరహా సంస్కృతి, బీచ్‌లో భార్యాభర్తలు రెండు పెగ్గులేసుకునే కల్చర్ రావాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడడంతో మహిళల పట్ల ఆయనకు ఎంత గౌరవం ఉందో అర్థమవుతుందని ధ్వజమెత్తారు. మీ కుటుంబ సభ్యులతో కలసి బీచ్‌లో రెండు పెగ్గు లేసుకుంటారా అని ప్రశ్నించారు. మన సంస్కృతి, మహిళలపై ఉన్న గౌరవం ఇదేనా అని నిలదీశారు. ఈ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మునికుమారి డిమాండ్ చేశారు.
రేపు జాబ్ మేళా
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కాకినాడలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి జి.శ్రీనివాసరావు తెలిపారు. డెక్కన్ ఫైన్ కెమికల్స్‌లో 100 ట్రైనీ కెమిస్ట్ పోస్టులకు, అపోలో ఫార్మసీలో 50 ఫార్మా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారన్నారు.
పార్వతి నందనా పాహిమాం..
పార్వతి నందనా పాహిమాం..


