సాక్షి, అమలాపురం: ఒకవైపు స్థానికునికే అసెంబ్లీ ఇన్‌చార్జి ఇవ్వాలని ఒత్తిడి ఉన్నప్పటికీ జిల్లాలోని పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి పరాయి పార్టీల నుంచి వచ్చిన వారికి పట్టం కట్టాలని.. లేదా పార్టీలో ఉన్న స్థానికేతరులకు అవకాశం కల్పించాలని టీడీపీ పెద్దల యోచిస్తున్నారు. ఈ నిర్ణయం ఆ నియోజకవర్గం టీడీపీలో చిచ్చురేపుతోంది. ఇప్పటికే ఏళ్లపాటు ఇన్‌చార్జి లేకుండా పోయిన ఇక్కడి పార్టీకి కొత్త ఇన్‌చార్జి నియామకం తలనొప్పిగా మారింది.
పి.గన్నవరం నియోజకవర్గంలో 2019 ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీకి పూర్తిస్థాయిలో ఇన్‌చార్జి లేరు. త్రీమెన్ కమిటీ పేరుతో ఆ పార్టీ కాలక్షేపం చేస్తోంది. ఇన్‌చార్జి లేకుండానే రెండు సాధారణ ఎన్నికలు చూసిన టీడీపీ శ్రేణులకు కనీసం స్థానిక సంస్థల ఎన్నికల ముందైనా ఇన్‌చార్జిని నియమించాలని నిర్ణయించింది. అది కూడా స్థానికులకు అవకాశం కల్పించాలనే డిమాండ్‌తో సమావేశాలు ఏర్పాటు చేయడం.. తీర్మానాలు చేసి పంపడం చేస్తున్నారు.
వలస నేతలు వద్దు
స్థానికేతరుల వివాదం కొనసాగుతుండగానే టీడీపీ అధిష్టానం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అవకాశం ఇవ్వాలని చూస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును పార్టీలోకి ఆహ్వానించి అతనికి ఇన్‌చార్జి పదవిని కట్టబెట్టాలని ఆలోచిస్తోంది. ఆయన కోసం జిల్లాకు చెందిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పార్టీ పెద్దల వద్ద పైరవీలు సైతం చేశారు. ఈ విషయం బహిర్గతం కావడంతో టీడీపీలో తీవ్ర వ్యతిరేకత చెలరేగి చర్చనీయాంశమైంది. నియోజకవర్గం పరిధిలోని అంబాజీపేట, పి.గన్నవరం, అయినవిల్లి మండలాలకు చెందిన ఆ పార్టీ నాయకులు చిట్టిబాబు రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పి.గన్నవరం మూడు రోడ్ల జంక్షన్ వద్ద నియోజకవర్గానికి చెందిన ఎస్సీ నాయకులు చిట్టిబాబు రాకకు వ్యతిరేకంగా స్థానికులకే ఇన్‌చార్జి ఇవ్వాలని ధర్నా సైతం చేయడం విశేషం. కొంతమంది నేరుగా మంత్రుల లోకేష్, అచ్చెన్నాయుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వద్ద పంచాయితీ పెట్టారు.
చిట్టిబాబు రాక వల్ల వచ్చే ప్రయోజనం లేదని, అతనిపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉందని వారికి వివరించారు. దీనితో చిట్టిబాబు రాక తాత్కాలికంగా వాయిదా పడింది. ఇదే సమయంలో నియోజకవర్గంలో మంత్రి సుభాష్ జోక్యంపై కూడా టీడీపీ క్యాడర్ మండిపడుతోంది. రామచంద్రపురం వదిలి అమలాపురం, పి.గన్నవరం నియోజకవర్గాలలో మంత్రి జోక్యాన్ని క్యాడర్ తప్పుపడుతోంది. ఈ పరిణామాలతో స్థానికేతరుల వివాదానికి వలసదారుల నినాదం తోడయ్యింది.
స్థానికేతరులు వద్దు
గత ఎన్నికల నాటి నుంచి పి.గన్నవరం టీడీపీలో స్థానిక రగడ కొనసాగుతూనే ఉంది. అయితే వారి అభ్యర్థనను కాదని కాకినాడ జిల్లా ప్రత్తిపాడుకు చెందిన సరెళ్ల రాజేష్‌ను అభ్యర్థిగా ప్రకటించి టీడీపీ చేతులు కాల్చుకుంది. అతని రాకను వ్యతిరేకించిన క్యాడర్ ప్రస్తుత ఎంపీ హరీష్ మాధుర్ కారును, పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీనితో ఈ సీటును జనసేనకు ఇచ్చి టీడీపీ చేతులు దులుపుకొంది. ఇప్పుడు ఇన్‌చార్జి విషయంలో కూడా స్థానికులను కాదని ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి, పార్టీలో ఉన్న స్థానికేతరులకు ఇస్తే ఇదే తరహా వ్యతిరేకత చవిచూడాల్సి వస్తుందని క్యాడర్ హెచ్చరికలు జారీ చేస్తోంది. పార్టీ నుంచి ఇన్‌చార్జి పదవి ఆశిస్తున్న రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డైరెక్టర్ మోకా ఆనంద సాగర్‌కు ఇవ్వాలని ఒక వర్గం పట్టుబడుతున్నా అతని వివాదాస్పద వైఖరి అడ్డంకిగా మారింది. పైగా ఆయన స్థానికేతరుడు కావడం గమనార్హం. ఇదే నియోజకవర్గానికి చెందిన నాగాబత్తుల సుబ్బారావు, నక్కా సునీల్‌లు ఇన్‌చార్జి కోసం ప్రయత్నంలో ఉన్నారు. ఈ వివాదాల కారణంగా టీడీపీ పి.గన్నవరం నియోజకవర్గ ఇన్‌చార్జి నియామకం మరికొంత కాలం వాయిదా పడనుంది.
పి.గన్నవరం నియోజకవర్గం
పి.గన్నవరం టీడీపీలో రాజుకున్న రగడ
స్థానికేతరుడిని
సహించబోమంటున్న పార్టీ శ్రేణులు
కొండేటి కోసం మంత్రి సుభాష్ పైరవీ
ఆయన పెత్తనంపై తీవ్ర వ్యతిరేకత
నియోజకవర్గ ఇన్‌చార్జి పదవిపై
అధిష్టానం మల్లగుల్లాలు
పరాయి నేతకు పట్టం!
పరాయి నేతకు పట్టం!


