మధుమేహాన్ని అరికడదాం
డీఎంఅండ్‌హెచ్‌వో దుర్గారావు దొర
ముమ్మిడివరం: మధుమేహంపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు నివారణ, నిర్వహణలో నూతన మార్గాలను వైద్య సిబ్బంది తెలియజేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.దుర్గారావు దొర పిలుపునిచ్చారు. తద్వారా మధుమేహ వ్యాధిని అరికట్టాలని కోరారు. స్థానిక ఎయిమ్స్ కళాశాలలో శుక్రవారం ప్రపంచ డయాబెటిస్ దినోత్సవాన్ని వైద్య సిబ్బందితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఏటా నవంబర్ 14న ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. డయాబెటిస్‌పై ప్రజలకు అవగాహన కల్పించడమే అతి పెద్ద గ్లోబల్ క్యాంపెయిన్ అన్నారు. 2025 సంవత్సరానికి ఈ దినోత్సవ థీమ్ డయాబెటిస్ అండ్ వెల్–బీయింగ్‌గా నిర్వహిస్తున్నామని డీఎంహెచ్‌వో తెలిపారు. పని ప్రదేశాల్లో ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం, మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం, డయాబెటిస్ ఉన్న వారికి సమగ్ర, సమానమైన, నాణ్యత స్థాయిలో వైద్యం అందించడంపై వైద్య సిబ్బంది దృష్టి పెట్టాలన్నారు. వివిధ దేశాలు, ప్రాంతాలు డయాబెటిస్ పరిణామాలు, ప్రమాద కారకాలు, ఆరోగ్యకర జీవనశైలి ఎంపికలు, సకాలంలో వైద్య పరీక్షల ప్రాముఖ్యంపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, వర్క్ షాప్‌లు, సదస్సులు, వెబినార్లు నిర్వహించినట్టు తెలిపారు. వీటితో పాటుగా మధుమేహంతో బాధపడు తున్నవారికి వారి బరువు నియంత్రణ, రోజు వారీ వ్యాయామం, మందుల సమయపాలన పాటించడం ముఖ్యమైనవని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుమలత, వైద్యులు, వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎం తదితరులు పాల్గొన్నారు.


