రౌడీలు.. రుబాబులు!
సాక్షి, అమలాపురం: ప్రశాంతతకు మారు పేరుగా నిలిచిన కోనసీమలో రౌడీయిజం బుసలు కొడుతోంది. ప్రభుత్వం మారిన తరువాత రౌడీషీటర్ల హవా పెరుగుతోంది. భూ దందాలు, పేకాట్ క్లబ్‌ల నిర్వహణతో ఆర్థిక దన్ను పెరగడంతో పచ్చని సీమలో రౌడీలు చెలరేగిపోతున్నారు.
జిల్లా కేంద్రం అమలాపురంలో ఇటీవల కంచిపల్లి శ్రీనివాస్ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎనిమిది మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడు శ్రీనివాస్, ప్రధాన నిందితుడు గంగుమళ్ల షణ్ముఖేశ్వరరావు (కాసుబాబు)ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో లీక్ కావడం శ్రీనివాస్ హత్యకు దారితీసింది. ఈ హత్య జరగిన తీరు కోనసీమవాసులను ఉలిక్కిపడేలా చేసింది. అనంతరం ఈ హత్య జరగడంతో రౌడీ షీటర్ల ఆగడాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.
చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత రౌడీ షీటర్ల ఆగడాలు పెరిగాయి. గతంలోనూ ఇదే పరిస్థితి ఉండేది. అయితే గత ప్రభుత్వంలో ఈ ఆగడాలకు చాలా వరకు పుల్‌స్టాఫ్ పడింది. ప్రభుత్వం మారిన తరువాత తిరిగి వీరి కార్యకలాపాలు జోరందుకున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో అమలాపురం, రామచంద్రపురాలలో జరిగిన ఎన్నికల్లో రౌడీషీట్ ఉన్న కీలక వ్యక్తుల ప్రమేయం అధికంగా ఉంది. ఈ రెండు చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలవడంతో వీరికి పట్టపగ్గాల్లేకుండా పోయింది. రౌడీ షీటర్లు ఈ సారి రూటు మార్చారు. ఆధిపత్య పోరు, ఘర్షణలు తగ్గి వీటి స్థానంలో భూ దందాలు.. మద్యం వివాదాలు.. పేకాట క్లబ్‌ల నిర్వహణకు దిగుతున్నారు.
టీడీపీ నేతల వత్తాసుతోనే రౌడీలు చెలరేగి పోతుంటే రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ మాత్రం రౌడీ షీటర్లు కూరగాయలు కోయాలన్నా భయపడేలా చేస్తామని హెచ్చరించడం గమనార్హం. ఇంతటితో ఆగకుండా కంచిపల్లి శ్రీనివాస్ హత్య కేసును ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ మీదకు తోసివేయడం ద్వారా బురద రాజకీయాలకు దిగారు. ప్రధాన నిందితుడు కాసుబాబు టీడీపీకి చెందిన మహిళా ప్రజాప్రతినిధికి సోదరుడు. ఇదే సమయంలో కంచుపల్లి శ్రీనివాస్ హత్య విషయంలో మంత్రి సుభాష్ చేసిన వ్యాఖలు వివాదాస్పదమవుతున్నాయి. హత్యకు గురైన శ్రీనివాస్ నాలిక కోసివేశారని, కళ్లు పీకేశారని మీడియా ముందు స్వయంగా వ్యాఖ్యానించారు. తద్వారా వైఎస్సార్ సీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నరనే తప్పుడు ప్రచారానికి దిగారు. అప్పటికి పోలీసులు హత్య జరిగిన తీరును విచారిస్తున్నారు కాని వివరాలు బయటకు వెల్లడించలేదు. తరువాత జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాహుల్ మీనా ఇటువంటిదేమీ జరగలేదని చెప్పడం గమనార్హం.
ఇటీవల కాలంలో కోనసీమ జిల్లా వ్యాప్తంగా భూ దందాలు ఎక్కువయ్యాయి. స్థానిక రౌడీ షీటర్ల దందా జిల్లా దాటి పక్క జిల్లాలకు విస్తరించింది. అమలాపురం చుట్టుపక్కల ఉన్న భూ వివాదాలను, వివాదాస్పద భూములను వీరు అవకాశాలుగా మార్చుకుంటున్నారు. ఇరు వర్గాల మధ్య వివాదాలు సృష్టించడం, సిటింగ్‌ల పేరుతో ఇరు పక్షాల వద్ద భారీగా సొమ్ములు వసూలు చేస్తున్నారు. రౌడీషీటర్లు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయడమే కాకుండా కొత్తగా ఎవరైనా వెంచర్లు వేస్తే వివాదాలు సృష్టించి సొమ్ములు స్వాహా చేస్తున్నారు.
మద్యం మాఫియా
చంద్రబాబు ప్రభుత్వం మద్యం పాలసీ రౌడీ షీటర్లకు కాసులు కురిపిస్తోంది. దుకాణాలకు టెండర్లు వేయడం నుంచి వాటిపై పెత్తనం వారిదే కొనసాగుతోంది. కొంతమంది మద్యం దుకాణదారులు దుకాణానికి ఒక రౌడీ షీటర్‌ను నియమించుకుని వ్యాపారం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పర్మిట్ రూములు, బెల్ట్ షాపుల నిర్వహణలో ఎదురయ్యే వివాదాల్లో రౌడీషీటర్లు నేరుగా జోక్యం చేసుకుంటున్నారు. వీటిపై కూడా నెలకు ఇంత అని సొమ్ములు వసూలు చేస్తున్నారు.
కాసులు కురిపిస్తున్న పేకాట క్లబ్‌లు
ఇటీవల కాలంలో పేకాలు రౌడీ షీటర్లకు భారీగా సొమ్ములు తెచ్చిపెడుతున్నాయి. అమలాపురంలో పేకాట క్లబ్‌లను నిర్వహిస్తున్న వారిలో ఇద్దరు రౌడీ షీటర్లు అధికార పార్టీకి సన్నిహితంగా ఉండడం గమనార్హం. జిల్లాకు చెందిన ఒక మహిళా నాయకురాలు పేకాట క్లబ్‌ల మీద సామాజిక మాధ్యమాల ద్వారా విమర్శలకు దిగడంతో జిల్లా ఎస్పీగా వచ్చిన రాహూల్ మీనా పలు క్లబ్‌లపై దాడులు చేశారు. అయితే అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి కీలక నేత ముఖ్య అనుచరులు నిర్వహిస్తున్న పేకాట క్లబ్బుల వైపు కన్నెత్తి చూసే ధైర్యం చేయలేకపోతున్నారు. అయినప్పటకీ కొన్ని తాత్కాలిక పేకాట క్లబ్‌లు మూతపడ్డాయి. కాని తిరిగి తెరిచేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారని తెలిసింది. ఈ ఆర్థిక దన్నుతోనే రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు. ఇది కాస్తా హత్యల వరకు వచ్చింది.
పోలీసుల కౌన్సెలింగ్
అమలాపురంలో గతంలోనూ రౌడీషీటర్ల మధ్య ఆధిపత్య పోరు కారణంగా హత్యలు చోటు చేసుకున్నాయి. కొన్నేళ్లుగా హత్యలు జరగడం లేదు. తాజాగా అమలాపురంలో హత్య ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు కూడా ఉలిక్కిపడ్డారు. జిల్లా ఎస్పీ మీనా ఆదేశాలతో రౌడీ షీటర్లను స్టేషన్‌లకు పిలిచి కౌన్సిలింగ్ మొదలు పెట్టారు. అయితే అధికార పార్టీ దన్ను ఉన్నంత కాలం వీరి ఆగడాలకు అడ్డుకట్టు పడే అవకాశం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం మారిన తర్వాత
రోడ్డెక్కుతున్న రౌడీ షీటర్లు
అమలాపురం అల్లర్లలో
వారి పాత్ర కీలకం
పేకాటలు, భూ దందాలతో
ఆర్థిక స్వావలంబన!
దన్నుగా నిలుస్తున్న ప్రజా ప్రతినిధులు
వెనక నుంచి ప్రోత్సహిస్తున్న వైనం
రౌడీలు.. రుబాబులు!


