ప్రభుత్వ పాఠశాలల్లోనే పబ్లిక్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల్లోనే పబ్లిక్‌ పరీక్షలు

Nov 15 2025 7:11 AM | Updated on Nov 15 2025 7:11 AM

ప్రభు

ప్రభుత్వ పాఠశాలల్లోనే పబ్లిక్‌ పరీక్షలు

రాయవరం: రానున్న విద్యా సంవత్సరం పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఉన్నత పాఠశాలల్లోనే నిర్వహించేలా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గతేడాది వరకూ ఈ పరీక్షలను ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉన్నత పాఠశాలలతో పాటు కొన్ని జూనియర్‌ కళాశాలల్లోనూ నిర్వహించారు. ఈ ఏడాది పరీక్షా కేంద్రాలను కచ్చితంగా ఉన్నత పాఠశాలల్లోనే ఏర్పాటు చేయాలని ఆదేశాలు రావడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

గత ఏడాది పరిస్థితి ఇదీ

గత ఏడాది జిల్లా వ్యాప్తంగా 110 కేంద్రాల్లో 18,871 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీటిలో 102 కేంద్రాలను ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఏర్పాటు చేశారు. అలాగే మూడు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలనూ పరీక్షా కేంద్రాలకు కేటాయించారు. కానీ ఈ ఏడాది వాటిని రద్దు చేసి తాజాగా పరీక్షలు రాయనున్న 19,604 మంది విద్యార్థుల కోసం కొత్త ఉన్నత పాఠశాలలను పరీక్షా కేంద్రాలుగా గుర్తించి జాబితాలను సిద్ధం చేసుకోవాలని విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు.

ప్రైవేటు కేంద్రాలను కుదించేలా చర్యలు

జిల్లాలో గత ఏడాది ఆరు ప్రైవేట్‌ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటి స్థానంలో జిల్లా విద్యాశాఖకు కొంత ఇబ్బంది ఏర్పడుతున్నట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బంది లేకున్నా, అమలాపురం, మండపేట, రామచంద్రపురం వంటి పట్టణాల్లో ప్రైవేటు పరీక్షా కేంద్రాల స్థానంలో ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేయడం కత్తిమీద సాములా ఉందని సమాచారం. పట్టణ ప్రాంతాల్లో ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రైవేటు పరీక్షా కేంద్రాలు అధిక శాతం పట్టణాల్లోనే ఉన్నాయి. పట్టణాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అవసరమైన తరగతి గదులు, మౌలిక వసతులు కల్పించి ప్రైవేట్‌ పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలను తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నారు.

ప్రైవేటు కేంద్రాల రద్దు ఎందుకంటే

సర్కారు బడుల్లో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అవసరమైన మౌలిక వసతులు లేవని ప్రైవేటు పాఠశాలలను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా డెస్క్‌లు, మరుగుదొడ్లు, విద్యుత్‌, తాగునీటి సదుపాయాలు లేవని వాటిని ఎంపిక చేస్తున్నారు. ఈ కేంద్రాలున్న చోట మాస్‌ కాపీయింగ్‌కు ఆస్కారం ఏర్పడుతోందని విద్యాశాఖ అంచనా. ఇటువంటి చర్యలకు అడ్డుకట్ట వేసేందుకే ప్రభుత్వ పాఠశాలల్లోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనికి తోడు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లోనూ మౌలిక వసతులు పెరగడం ఒక కారణం.

జూనియర్‌ కళాశాలల్లో రద్దు యోచన

పదో తరగతి పరీక్షా కేంద్రాలను ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఏర్పాటు చేయడానికి స్వస్తి చెబుతున్నారు. ఇంటర్‌, పదో తరగతి పరీక్షలు ఇంచుమించుగా దగ్గర దగ్గరగా లేదా ఒకే రోజు కొన్ని పరీక్షలు వస్తే ఇబ్బంది ఎదురవుతోంది. ముఖ్యంగా ఇంటర్‌ చివరి పరీక్ష రోజున పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పరీక్షల నిర్వహణ వద్దని నిర్ణయించారు.

కసరత్తు చేస్తున్నా

ప్రభుత్వ పాఠశాలల్లోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలనే విషయంపై కసరత్తు జరుగుతోంది. డివిజన్‌ కేంద్రాల నుంచి సమాచారం రప్పిస్తున్నాం. వారం రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుంది.

– బి.హనుమంతరావు, అసిస్టెంట్‌ కమిషనర్‌, ప్రభుత్వ పరీక్షల విభాగం, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా

కట్టుదిట్టంగా నిర్వహించేందుకే..

మాస్‌ కాపీయింగ్‌ నిరోధానికి ఏటా విద్యాశాఖ కొత్త విధానాలను అవలంబిస్తోంది. అందులో భాగంగానే పదో తరగతి పరీక్షలను పూర్తిగా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నాం. తప్పనిసరి అయితేనే ప్రైవేట్‌ పాఠశాలలను ఎంపిక చేస్తాం.

– డాక్టర్‌ షేక్‌ సలీం బాషా, డీఈఓ,

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా.

పదో తరగతి పరీక్షా కేంద్రాలపై

పాఠశాల విద్యాశాఖ కసరత్తు

ఉన్నత పాఠశాలల్లో మాత్రమే నిర్వహణ

పది, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ దృష్ట్యా

జూనియర్‌ కళాశాలల్లో నిర్వహణకు నో

ప్రైవేటు కళాశాలల్లోనూ

క్రమంగా తగ్గించే యత్నం

పోలీస్‌ స్టేషన్‌కు 8 కిలోమీటర్లు

గతంలో పోలీసు స్టేషన్‌ నుంచి రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలలనే పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేసేవారు. ఆ తర్వాత నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ ఏడాది పోలీసు స్టేషన్‌కు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేసేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. విద్యార్థులకు దూరాభారం తగ్గించి మరికొన్ని పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రక్రియలో పోలీస్టేషన్‌కు 8 కిలోమీటర్ల దూరాన్ని ప్రాతిపదికగా తీసుకుంటున్నట్లు సమాచారం. పలు చోట్ల కొత్తగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని క్షేత్ర స్థాయిలో వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వీటిని ఏర్పాటు చేస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే పబ్లిక్‌ పరీక్షలు1
1/2

ప్రభుత్వ పాఠశాలల్లోనే పబ్లిక్‌ పరీక్షలు

ప్రభుత్వ పాఠశాలల్లోనే పబ్లిక్‌ పరీక్షలు2
2/2

ప్రభుత్వ పాఠశాలల్లోనే పబ్లిక్‌ పరీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement