లక్ష్మీ నృసింహునికి టికెట్ కౌంటర్ సమర్పణ
సఖినేటిపల్లి: అంతర్వేది దేవస్థానానికి శుక్రవారం పాలకొల్లుకు చెందిన వాకాడ అప్పారావు–విశాలక్షి దంపతులు రూ.లక్ష విలువైన టికెట్ కౌంటర్‌ను సమర్పించారు. ఆలయంలో అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్‌వీ ప్రసాద్‌కు దాతలు కౌంటర్‌ను అందజేశారు. ఆ కౌంటర్‌కు ఆలయ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు పూజలు చేశారు. దాతలకు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాన్ని ఏసీ ప్రసాద్ అందజేశారు.
21 నుంచి సముద్ర
నాచు తయారీ ప్రాజెక్టు
అమలాపురం రూరల్: ఈ నెల 21వ తేదీ ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో సముద్రపు నాచు తయారీని పైలెట్ ప్రాజెక్టుగా పల్లం, ఎస్.యానాం గ్రామాలలో ప్రారంభించనున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఈ ప్రాజెక్టుపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సముద్ర తీరం వెంబడి నాచు తయారీ యూనిట్లకు 16 మంది డ్వాక్రా మహిళలు, ఆర్నమెంట్ చేపల పెంపకానికి 21 మంది, పీతల పెంపకానికి పది మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. లబ్ధిదారుల ఎంపికపై ఆయన కమిటీ అనుమతితో ఆమోదముద్ర వేశారు. వీరికి యూనిట్ల ఏర్పాటుకు విత్తనం, మౌలిక వసతుల కల్పన సాంకేతిక సహకారం వంటి అంశాలతో పాటు వివిధ పథకాల ద్వారా రాయితీతో ఆర్థిక సహాయం చేసి ప్రోత్సహించనున్నట్టు తెలిపారు. అలాగే యూనిట్ల ఏర్పాటులో డ్వాక్రా రుణాలను అందించనున్నామని, యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక వసతుల కల్పన, గ్రీన్ కై ్లమేట్ ఫండ్ తరపున ఆర్థిక సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ కె.మాధవి, గ్రీన్ కై ్లమేట్ ఫండ్ జిల్లా కో ఆర్డినేటర్ శ్రీహర్ష, డీఆర్‌డీఏ పీడీ గాంధీ, జిల్లా మత్స్య శాఖ ఏడీ వర్ధన్, అటవీ శాఖ అధికారి ఎంవీ ప్రసాదరావు, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ కేశవ వర్మ, జిల్లా వ్యవసాయ అధికారి వి.బోసుబాబు పాల్గొన్నారు.
ఎస్పీకి సత్కారం
అమలాపురం టౌన్: పట్టణానికి చెందిన కముజు నిషిత అనే బాలిక కిడ్నాప్ ఘటనలో పోలీసులు చూపిన చొరవకు కృతజ్ఞతగా ఎస్పీ రాహుల్ మీనాను బాలిక కుటుంబీకులు, వైఎస్సార్ సీపీ నేతలు శుక్రవారం స్వయంగా కలిసి అభినందించి సత్కరించారు. స్థానిక ఎస్పీ కార్యాలయానికి బాలిక కుటుంబీకులు, పార్టీ నాయకులు వెళ్లి ఎస్పీతో మాట్లాడారు. తమ పాప అదృశ్యమైన పది గంటల్లో పోలీసులు చాకచక్యంగా వ్యహరించి ఎలాంటి ఆపద లేకుండా పాపను అప్పగించడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు. బాలిక తండ్రి, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి కముజు రమణ దంపతులు, వారి పిల్లలు నిషిత, మోక్ష, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, అమలాపురం రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు గుత్తుల చిరంజీవరావు, మున్సిపల్ కౌన్సిలర్లు గొవ్వాల రాజేష్, చిత్రపు రామకృష్ణ, గోపి రమేష్, కముజు రమణ స్నేహితులు ఎస్పీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
రత్నగిరికి భక్తుల తాకిడి
అన్నవరం: సత్యదేవుని ఆలయానికి భక్తుల తాకిడి కొనసాగుతోంది. కార్తిక బహుళ దశమి, శుక్రవారం పర్వదినం కావడంతో తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకూ వేలాదిగా భక్తులు రత్నగిరికి తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలు, క్యూ లైన్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. సాయంత్రం 4 గంటల వరకూ రద్దీ కొనసాగింది. సుమారు 50 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. వ్రతాలు 4,800 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు పేర్కొన్నారు.
94 వేలు దాటిన సత్యదేవుని వ్రతాలు
కార్తిక మాసంలో శుక్రవారం నాటికి సత్యదేవుని వ్రతాలు 94 వేలు మాత్రమే జరిగాయి. గత ఏడాది ఇదే సమయానికి 1,19,550 వ్రతాలు జరిగాయి.
లక్ష్మీ నృసింహునికి టికెట్ కౌంటర్ సమర్పణ


