అన్నవరం.. భక్త జన సాగరం!
అన్నవరం: కార్తిక పౌర్ణిమ సందర్భంగా బుధవారం నిర్వహించిన సత్యదేవుని గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులతో అన్నవరం కిక్కిరిసిపోయింది. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎక్కడ చూసినా జనమే. ఉదయం ఎనిమిది గంటలకు పల్లకీ మీద, మధ్యాహ్నం రెండు గంటలకు సత్యరథం మీద సాగిన ఈ గిరి ప్రదక్షిణలో రెండు లక్షలకు పైగా భక్తులు పాల్గొన్నారని అంచనా. ఉదయం పల్లకీ మీద, మధ్యాహ్నం ప్రచార రథంపై సత్యదేవుని గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఇసుకేస్తే రాలని విధంగా భక్తులు తరలి రావడంతో అన్నవరం మెయిన్‌రోడ్డుపై గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయింది.
దేవుడే కొండ దిగి వచ్చిన వేళ...
తన చెంతకు రాలేని భక్తులకు, రత్నగిరి, సత్యగిరులపై వృక్షాలు, పక్షులకు దర్శన భాగ్యం కల్పించేందుకు సత్యదేవుడు కొండ దిగివచ్చిన వేళ అది. సత్యదేవుడు, దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీ అమ్మవారితో కలిసి లక్ష లాది మంది భక్తజనం వెంట రాగా పంపానది తీరం వెంబడి సాగిన గిరి ప్రదక్షిణ నభూతో నభవిష్యతి అన్నట్టుగా సాగింది. భక్తులు సత్యనారాయణ, లక్ష్మీనారాయణ అంటూ స్వామివారి నామం జపిస్తూ 8.5 కిలోమీటర్లు మేర సాగిన గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఉదయం ఆరు గంటల నుంచి భక్తులు తొలిపాంచాకు చేరుకోవడంతో అక్కడ తీవ్ర రద్దీ ఏర్పడింది. ఉదయం ఏడు గంటలకు సత్యదేవుడు అమ్మవార్లను మేళతాళాల మధ్య రత్నగిరి నుంచి కొండదిగువన గల తొలిపాంచా వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. స్వామి, అమ్మవార్లకు పండితులు ప్రత్యేక పూజలు చేసి పల్లకీ మీద ప్రతిష్ఠించారు. ఉదయం 8–30 గంటలకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, ఆలయ చైర్మన్ ఐవీ రోహిత్, గిరి ప్రదక్షిణ ప్రత్యేకాధికారి వీ త్రినాథరావు, ఈఓ వీర్ల సుబ్బారావు కొబ్బరికాయలు కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. భజనలు, కోలాట నృత్యాలు, మహిళల భక్తి గీతాల నడుమ సత్యరథంతో గిరి ప్రదక్షిణ సాగింది.
ఉదయం పల్లకీలో..
అన్నవరం మెయిన్ రోడ్డు మీదుగా బెండపూడి సమీపంలోని పుష్కర కాల్వ వద్దకు ఉదయం తొమ్మిది గంటలకు పల్లకీ చేరింది. అక్కడ భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి పుష్కర కాల్వ వెంబడి పంపా తీరం వరకూ గిరి ప్రదక్షిణ సాగింది. మధ్యలో మూడుచోట్ల స్వామి, అమ్మవార్లకు భక్తులు స్వాగతం పలికారు. ఆ ప్రదేశాలలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు పూజలు చేశారు.
మధ్యాహ్నం సత్యరథంపై..
సత్యరథంపై మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన గిరి ప్రదక్షిణ సాయంత్రం మూడు గంటలకు బెండపూడి ఆర్చి వద్దకు చేరింది. ఆ తరువాత పుష్కర కాల్వ వెంబడి సాగింది. పంపా ఘాట్‌కు సాయంత్రం ఆరు గంటలకు చేరింది. అక్కడ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఊరేగింపుగా స్వామి అమ్మవార్లను రత్నగిరికి చేర్చారు. గిరి ప్రదక్షిణలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, నర్సాపురం పార్లమెంటరీ వైఎస్సార్ సీపీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు పాల్గొన్నారు. ఆలయ వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠీ, యనమండ్ర శర్మ, గంగాధరబట్ల గంగబాబు, ముష్టి పురుషోత్తం అవధాని, చిట్టి శివ ఘనపాఠీ, సంతోష్ ఘనపాఠీ, ప్రధానార్చకులు ఇంద్రగంటి నర్శింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యం కార్యక్రమం నిర్వహించారు.
గిరి ప్రదక్షిణను ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభ. చిత్రంలో చైర్మన్ రోహిత్, ఆర్‌జేసీ త్రినాథరావు, ఈఓ సుబ్బారావు, ప్రత్తిపాడు సీఐ సూర్యఅప్పారావు
సత్యరథంతో గిరి ప్రదక్షిణలో పాల్గొన్న అధికారులు
భక్తుల రద్దీ కారణంగా జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాలు
నభూతో నభవిష్యతి అన్నట్టు సాగిన
సత్యదేవుని గిరి ప్రదక్షిణ
పాల్గొన్న రెండు లక్షల మందికి పైగా భక్తులు
ఉదయం పల్లకీపై, మధ్యాహ్నం
ప్రచార రథంపై రెండుసార్లు
నిర్వహించినా తరగని జనం
జాతీయ రహదారిపై
పలుమార్లు ట్రాఫిక్ జామ్
అన్నవరం.. భక్త జన సాగరం!
అన్నవరం.. భక్త జన సాగరం!
అన్నవరం.. భక్త జన సాగరం!
అన్నవరం.. భక్త జన సాగరం!


