బ్యాంక్ ఖాతాలోని సొమ్మును తిరిగి పొందండి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): మీ డబ్బు.. మీ హక్కు నినాదంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూడు నెలల పాటు నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రచార కార్యక్రమంపై రూపొందించిన వాల్‌పోస్టర్‌ను బుధవారం కలెక్టర్ షణ్మోహన్ బ్యాంకు అధికారులతో కలిసి కలెక్టరేట్‌లో విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ 10 ఏళ్లు అంతకుమించి లావాదేవీలు జరగని బ్యాంకు ఖాతాల్లో సొమ్మును బ్యాంకులు తిరిగి ఇచ్చేస్తాయన్నారు. మీ డబ్బు.. మీ హక్కు నినాదంతో భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం ద్వారా పౌరులు తమ పేరు మీద ఉన్న క్లెయిమ్ చేయని , మరిచిపోయిన ఆస్తులను తిరిగి పొందే అవకాశం కల్పించిందన్నారు. ప్రజలు బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడం, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, మీమా పాలసీలు, ఇతర ఆర్థిక సాధనాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా తమ కుటుంబ భవిష్యత్తును సురక్షితం చేసుకుంటున్నారన్నారు. కొన్ని సందర్భాల్లో ఈ ఆస్తులు లబ్ధిదారులకు చేరకపోవడానికి ఖాతాదారుల మరణం, చిరునామా మార్పు, నామిని వివరాల లోపం వంటి కారణాలుగా ఉంటున్నాయన్నారు. ఆర్బీఐ కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాకినాడ జిల్లాలో 5,72,938 వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో రూ.83.36 కోట్లు, 10,048 వివిధ సంస్థల బ్యాంకు ఖాతాల్లో రూ.12.60 కోట్లు, 5,535 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బ్యాంకు ఖాతాల్లో రూ.5.26 కోట్లు ఇలా మొత్తం 5,88,521 బ్యాంకు ఖాతాల్లో రూ.101.22 కోట్లు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. వీటికి సంబంధించిన వ్యక్తులు, సంస్థల ప్రతినిధులు సరైన ధ్రువపత్రాలతో ఈకేవైసీ పూర్తి చేసి, తమ సొమ్మును తిరిగి పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంకు అధికారిసీహెచ్‌ఎస్వీ ప్రసాద్ పాల్గొన్నారు.


