నిష్పక్షపాతంగా బాలిక మృతి కేసు దర్యాప్తు
అమలాపురం టౌన్: రామచంద్రపురంలో పదేళ్ల బాలిక మృతిపై నమోదైన కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ రాహుల్ మీనా స్పష్టం చేశారు. ఆ కేసు దర్యాప్తు బాధ్యతను రామచంద్రపురం డీఎస్పీకి అప్పగించామన్నారు. ఈ మేరకు అమలాపురంలోని ఎస్పీ కార్యాలయం నుంచి బుధవారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. బాలిక పోస్టుమార్టాన్ని ఒకరి కంటే ఎక్కువ మంది వైద్యులు నిర్వహించేలా, వారిలో ఒక మహిళా డాక్టర్ కచ్చితంగా ఉండాలని ఆదేశించామన్నారు. మృతి చెందిన బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని, దర్యాప్తు అత్యంత పకడ్బందీగా జరుగుతోందన్నారు.
మూడు చక్రాల మోటారు
వాహనాలకు దరఖాస్తులు
అమలాపురం రూరల్: జిల్లాలోని విభిన్న ప్రతిభావంతుల నుంచి మూడు చక్రాల మోటారు వాహనాలకు దరఖాస్తులు కోరుతున్నట్టు విభిన్న ప్రతిభావంతుల, వయో వృద్ధుల సహాయ సంస్థ సహాయ సంచాలకులు, జిల్లా మేనేజర్ ఏవై శ్రీనివాస్ కోరారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నియోజకవర్గానికి పది చొప్పున మంజూరు చేస్తామన్నారు. అర్హులు www.apdarcac.ap.gov.in ద్వారా దరఖాస్తులను ఈ నెల 25వ తేదీ లోపు అందించాలన్నారు. వారి వయసు 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలని, సదరమ్ ధ్రువీకరణ పత్రంలో కాళ్లలో (లోయర్ లింబ్స్) వైకల్యం 70 శాతం, అంతకంటే ఎక్కువ ఉండాలని, కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించరాదన్నారు. మోటారు వాహన చట్టం ప్రకారం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని, గతంలో ప్రభుత్వం, ప్రభుత్వ ఏజెన్సీ, ప్రైవేట్ ఏజెన్సీ, ఇతర ఏదైనా రూపం నుంచి మోటారైజ్డ్ వాహనం పొంది ఉండకూడదని స్పష్టం చేశారు.
మండపేటను
‘తూర్పు’లో కలపాలి
కపిలేశ్వరపురం (మండపేట): జిల్లా పరిధిలో ఉన్న మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయాలంటూ జేఏసీ నాయకులు బుధవారం కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్‌ను కోరారు. ఏడిద గ్రామ పర్యటనకు వచ్చిన కలెక్టర్‌కు ఆ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. జేఈసీ చైర్మన్ కామన ప్రభాకరరావు, మున్సిపల్ చైర్‌పర్సన్ పతివాడ నూక దుర్గారాణి, దళిత నాయకుడు ధూళి జయరాజు, బీజేపీ నాయకుడు కోన సత్యనారాయణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కె.కృష్ణవేణి తదితరులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ తమ డిమాండ్‌కు సానుకూలంగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కోరారు.


