మాజీ మంత్రి గొల్లపల్లికి గుండెపోటు
● అమలాపురం కిమ్స్‌లో చికిత్స
● పరామర్శించిన
వైఎస్సార్ సీపీ నాయకులు
అమలాపురం రూరల్: వైఎస్సార్ సీపీ రాజోలు కో ఆర్డినేటర్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు గుండెపోటుకు గురయ్యారు. ఆయనను వెంటనే అమలాపురం కిమ్స్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. రాజోలు మండలం శివకోడులో గురువారం జరిగే రచ్చబండ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించడానికి ఆయన బుధవారం వెళ్లారు. పార్టీ నాయకుడు ఇంటిలో మెట్లు ఎక్కి వెళుతుండగా అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చింది. వెంటనే పార్టీ నాయకులు స్థానిక ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఈసీజీలో తేడా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం అమలాపురం కిమ్స్ హాస్పిటల్లో చేర్పించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ అమలాపురం కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రీకాంత్.. కిమ్స్ వైద్యులతో మాట్లాడారు. కిమ్స్ గుండె వైద్యుడు అభిషేక్ వర్మ ఆధ్వర్యంలో వైద్య నిపుణుల బృందం గొల్లపల్లి గుండెలోని క్లాట్స్ తొలగించి రెండు స్టంట్లు వేశారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. సూర్యారావు ఆరోగ్యం మెరుగ్గా ఉందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని డాక్టర్ శ్రీకాంత్ సూచించారు. కిమ్స్ చైర్మన్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) పర్యవేక్షణలో సూర్యారావుకు వైద్యులు సేవలు అందిస్తున్నారు. కాగా.. సూర్యారావు అస్వస్థతకు గురైన విషయం తెలియడంతో జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, ముమ్మిడివరం కో ఆర్డినేటర్ పొన్నాడ వెంకట సతీష్ కుమార్, రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి బాబీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, పితాని బాలకృష్ణ, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు జున్నూరి వెంకటేశ్వరరావు, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కటకంశెట్టి ఆదిత్య కుమార్ తదితరులు ఆయనను పరామర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సూర్యారావును వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి బుధవారంరాత్రి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. సూర్యారావు ఆరోగ్యం నిలకడగానే ఉందని, కార్యకర్తలు ఆందోళన చెందవద్దన్నారు.
మాజీ మంత్రి గొల్లపల్లికి గుండెపోటు
మాజీ మంత్రి గొల్లపల్లికి గుండెపోటు


