9,800 వ్రతాల నిర్వహణ
అన్నవరం : కార్తిక పౌర్ణిమ పర్వదినం సందర్బంగా బుధవారం రత్నగిరి సత్యదేవుని ఆలయానికి భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. దేవస్థానం ఘాట్‌రోడ్లు, మల్టీ లెవిల్ పార్కింగ్ స్థలాలు కార్లతో నిండిపోయాయి. రికార్డు స్థాయిలో సుమారు లక్ష మంది భక్తులు సత్యదేవుని దర్శించారని అధికారులు అంచనా వేశారు. స్వామివారి వ్రతాలు రికార్డు స్థాయిలో 9,800 జరిగాయి. వ్రతాల ద్వారా సుమారు రూ.60 లక్షలు, మిగిలిన విభాగాల ద్వారా రూ.40 లక్షలు వచ్చిందని అంచనా. మంగళవారం రాత్రికే సుమారు 30 వేల మంది భక్తులు రత్నగిరికి చేరుకోవడంతో స్వామివారి ఆలయాన్ని బుధవారం తెల్లవారుజామున ఒంటిగంటకు తెరచి వ్రతాలు ప్రారంభించారు. రెండు గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. సాయంత్రం ఆరు గంటల వరకు స్వామివారి వ్రత మండపాలు, నిత్య కల్యాణ మండపం, పాత కల్యాణ మండపాలు అన్నీ వ్రతాలాచరించే భక్తులతో నిండిపోయాయి. అంతరాలయ దర్శనం టిక్కెట్ తీసుకున్న భక్తులను కూడా వెలుపల నుంచే దర్శనానికి అనుమతించారు. తూర్పు రాజగోపురం ఎదురుగా గల రావిచెట్టు వద్ద, ఆలయ ప్రాంగణంలో, ధ్వజస్తంభం వద్ద ఏర్పాటు చేసిన ర్యాకులలో భక్తులు జ్యోతులు వెలిగించారు.
9,800 వ్రతాల నిర్వహణ


