ఉద్యోగులు నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలి
సామర్లకోట: ఉద్యోగులు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలందించవచ్చని విస్తరణ శిక్షణ కేంద్రం (ఈటీసీ) ప్రిన్సిపాల్ కేఎన్‌వీ ప్రసాదరావు అన్నారు. స్థానిక ఈటీసీలో శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకూ ఉన్న 11 జిల్లాల్లోని డిప్యూటీ ఎంపీడీఓలకు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై శిక్షణను సోమవారం ఆయన ప్రారంభించారు. ఉద్యోగులు సాంకేతిక, నైపుణ్యతను పెంపొందించుకుంటే పంచాయతీ రాజ్ శాఖలో పదోన్నతులు త్వరగా వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో సమస్యలు లేకుండా ప్రజల అవసరాలను గుర్తించడానికి సుస్థిరాభివృద్ధి అంశాలపై ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించిందన్నారు. అదే విధంగా ఎంపీడీఓ, జిల్లా పరిషత్తు కార్యాలయాల్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులకు ఆరు రోజుల పాటు నిర్వహించే ప్రాథమిక శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ, డీడీఓ డి.శ్రీనివాసరావు, ఎంపీడీఓ ఎస్‌ఎస్ శర్మ, ఫ్యాకల్టీ కె.సుశీల శిక్షణ తరగతులు నిర్వహించారు.


