వాడపల్లి
కొత్తపేట: కోనసీమ తిరుపతిగా పేరుపొందిన ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. తిరుమల (పెద్ద తిరుపతి), ద్వారకా తిరుమల (చిన్న తిరుపతి) తర్వాత ఏడు వారాల వెంకన్న దర్శనం – ఏడేడు జన్మల పుణ్య ఫలం అనే నానుడితో భక్తుల విశ్వాసం చూరగొంది. ఈ క్షేత్రానికి ప్రతి శనివారం రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 70 వేల నుంచి 90 వేల మంది భక్తులు వస్తారు. ఏడు ప్రదక్షిణలు చేసే భక్తులతో ఆలయం చుట్టూ గల మాడ వీధులు, స్వామి దర్శనానికి ఏర్పాటు చేసిన అన్ని క్యూలైన్లు కిక్కిరిసిపోతున్నాయి. పెరిగిన భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వంలో సౌకర్యాలు మెరుగుపర్చారు. అయితే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఇక్కడ పోలీసు బందోబస్తు తక్కువనే చెప్పాలి. ప్రైవేట్ సిబ్బందిపైనే దేవస్థానం ఆధారపడింది. 190 మంది ప్రైవేట్ సిబ్బంది 2 షిప్టులుగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. పోలీసు సిబ్బంది 40 మంది వరకు ఉంటారు. అయితే ఇక్కడ స్థలం తక్కువగా ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది.


