కాలువలో దూకి యువకుడి ఆత్మహత్య
గోకవరం: మండలంలోని తంటికొండ, గాదెలపాలెం గ్రామాల మధ్య ఉన్న పోలవరం కాలువలో దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తంటికొండకు చెందిన కామిశెట్టి పుష్పభగవాన్ (22) శుక్రవారం రాత్రి పోలవరం కాలువలో దూకాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కాలువలో గాలించగా శనివారం ఉదయం విగతజీవిగా తేలాడు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. మృతుడు ఫార్మసీలో డిప్లమో చేస్తున్నాడని, ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
800 సెల్‌ఫోన్ల రికవరీ
కాకినాడ క్రైం: దొంగిలించబడిన, పోగొట్టుకున్న 800 సెల్‌ఫోన్లను వాటి యజమానులకు పోలీసులు అప్పగించారు. కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ బిందు మాధవ్ ఆ వివరాలు వెల్లడించారు. సాంకేతికతను వినియోగించి సెల్‌ఫోన్లను గుర్తించామన్నారు. దీనిలో పోలీస్ ఐటీ కోర్ విభాగం కీలకంగా వ్యవహరించిందన్నారు. రికవరీ చేసి అప్పగించిన 800 సెల్‌ఫోన్ల విలువ సుమారు రూ.1.36 కోట్లని తెలిపారు.
4న ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్ల ఎంపిక
అమలాపురం రూరల్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 4న అంబాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్రికెట్ జట్ల ఎంపిక నిర్వహించనున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీమ్ బాషా శనివారం ఈ విషయం తెలి పారు. అండర్ 14 బాలురు, అండర్ 17 బాలికల జట్లను ఎంపిక చేస్తామన్నారు. పాల్గొనే విద్యార్థులు ఆ రోజు ఉదయం 9 గంటల లోపు రిపోర్టు చేయాలన్నారు. ఇతర వివరాలకు ఎస్‌జీఎఫ్ సెక్రటరీలు కొండేపూడి ఈశ్వరరావు 93469 20718, ఏఎస్‌ఎస్ రమాదేవి 94400 94984లను సంప్రదించాలన్నారు.


