
ఆధ్యాత్మిక సీమ
● కార్తిక మాసం ప్రారంభం
● ముస్తాబైన శైవ క్షేత్రాలు, విష్ణు ఆలయాలు
● ఎక్కడ చూసినా భక్తుల సందడి
● జిల్లాలో సప్త నదీపాయల వెంబడిప్రసిద్ధి శివాలయాలు
సాక్షి, అమలాపురం: సప్త గోదావరి నదీ పాయల పరవళ్లతో పుణ్యభూమిగా మారిన కోనసీమ కార్తిక శోభను సంతరించుకుంది. నదీ పాయల వెంబడి వెలసిన పురాణ ప్రసిద్ధి చెందిన ఆలయాలతో ఆధ్యాత్మికత నెలకొంది. పూజలు, అభిషేకాలు, వ్రతాలతో ఆలయాలు, అలాగే అయ్యప్ప, శివ, ఆంజనేయస్వామి మాలధారణ చేసిన భక్తులతో ఈ నెల రోజులూ జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక సందడి కనిపించనుంది.
శివకేశవులకు..
శివ కేశవులకు ప్రీతికరమైన కార్తిక మాసం ప్రారంభమైంది. మార్గశిర మాసం విష్ణుమూర్తికి, కార్తిక మాసం శివ కేశవులకు ప్రీతిపాత్రమని పురాణ, ఇతిహాసాలు చెబుతున్నాయి. అయితే శివాలయాలకు వెళ్లే భక్తులే అధికంగా ఉంటారు. నాగుల చవితి, క్షీరాబ్ధి ద్వాదశి, మాస శివరాత్రి, కార్తిక పౌర్ణమి వంటి ముఖ్య పర్వదినాలతో పాటు ఈ మాసంలో వచ్చే నాలుగు సోమ వారాలు, రెండు ఏకాదశుల పర్వదినాలు శివ భక్తులు ఎంతో పుణ్యప్రదమైనవిగా భావిస్తారు. కార్తిక మాసం మొదలవుతున్న నేపథ్యంలో జిల్లాలోని పట్టణాలు, పల్లెల్లోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. వీటితో పాటు విష్ణు ఆలయాలు, ఇతర ప్రముఖ ఆలయాలను కూడా దేదీప్యమైన కాంతులతో సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రముఖ ఆలయాల వివరాలు తెలుసుకుందాం.
కోటిపల్లి ఛాయా సోమేశ్వరస్వామి
కె.గంగవరం: గౌతమీ గోదావరి చెంతనే ఉన్న కోటిపల్లి రాజరాజేశ్వరీ సమేత ఛాయా సోమేశ్వర స్వామిని దర్శిస్తే కోటి ఫలితాలు అందుతాయని భక్తుల విశ్వాసం. కోటి కన్యాదానాల ఫలం, నూరు అశ్వమేధ యాగాల ఫలం, కోటి శివలింగాలను ప్రతిష్ఠ చేసిన పుణ్యఫలాన్ని ఇచ్చేది ఈ క్షేత్రం. భక్తులు పక్కనే ఉన్న గోదావరిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు. కార్తికంలో ఈ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది.
ముక్తేశ్వరుడు
అయినవిల్లి: వృద్ధ గౌతమీ నదీ పాయను ఆనుకుని ఉన్న క్షణ ముక్తేశ్వరస్వామిని దర్శి స్తే తక్షణం ముక్తిని పొందుతారని భక్తుల విశ్వాసం. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర మూర్తి స్వయంగా ప్రతిష్ఠించిన ఆలయంగా ముక్తికాంత క్షణ ముక్తేశ్వరస్వామి ఆలయాన్ని చెబుతారు. ఇక్కడ స్వామివారిని దర్శిస్తే క్షణంలో ముక్తిని ప్రసాదిస్తారని నమ్మకం. కోటిపల్లికి వచ్చే భక్తులు ముక్తేశ్వరం రేవు దాటి ఇక్కడ ఆలయానికి వస్తుంటారు.
పలివెల ఉమా కొప్పేశ్వర క్షేత్రం
కొత్తపేట: మండల పరిధి పలివెలలో గౌతమీ, వశిష్ట నదీ పాయల మధ్య వెలసిన ఉమా కొప్పేశ్వర స్వామి క్షేత్రం పురాణ ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. పూర్వం అగస్త్య మహాముని తపస్సు ఫలితంగా శివపార్వతులు ఏకపీఠంపై కొలువు తీరినట్లు స్థల పురాణంలో పేర్కొన్నారు. ఆలయంలో పరమ నిష్టాగరిష్టుడైన పూజారి ప్రాణాలు నిలిపేందుకు పరమశివుడు కొప్పును ధరించినట్లు చెబుతారు. అందుకే ఇక్కడ శివలింగానికి ముందు భాగంలో కొప్పు ఉంటుంది. ఆలయాన్ని దేవతలు నిర్మించాలని ప్రతీతి.
● శుభ ఫలితాలు
కార్తిక మాసానికి సమానమైన మాసం లేదని స్కాంద పురాణం పేర్కొంది. శివ కేశవులకు ఈ మాసం ఎంతో ప్రీతికరం. శివ కేశవుల ఆలయాలను దర్శించినా, పుణ్య స్నానాలు ఆచరించినా, దీపారాధన, దీప దానం చేసినా, ఉపవాసం ఉన్నా శుభ ఫలితాలు కలుగుతాయి.
– రవి శర్మ నాగాభట్ల, మురమళ్ల వీరేశ్వర స్వామి దేవస్థానం పురోహితులు
కుండలేశ్వరస్వామి
ద్రాక్షారామ భీమేశ్వరస్వామి
రామచంద్రపురం రూరల్ : ద్రాక్షారామలోని మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయం దక్షిణ కాశీగా, పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా, త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాల్లో 12వ శక్తిపీఠంగా విరాజిల్లుతోంది. ఇది గౌతమీ తీరం సమీపంలో తూర్పున ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. కార్తిక మాసంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బారికేడ్ల నిర్మాణం చేపట్టారు. ఆలయ ప్రాంగణంలోని సప్త గోదావరీ నదిలో స్నానమాచరించి భీమేశ్వరస్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, మాణిక్యాంబా అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహిస్తారు.
మురమళ్ల వీరేశ్వరస్వామి
ఐ.పోలవరం: వృద్ధ గౌతమీ నదీపాయను ఆనుకుని ఉన్న ఐ.పోలవరం మండలం మురమళ్లలోని వీరేశ్వరస్వామి ఆలయం నిత్య కల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతోంది. ఇక్కడ స్వామివారికి కల్యాణం నిర్వహిస్తే పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుందని భక్తుల నమ్మకం. పర్వదినాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉన్నందున ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తారు. కార్తిక మాసంలో ఇక్కడకు భక్తులు పెద్దసంఖ్యలో వస్తారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. కార్తిక మాసంలో ఈ ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
కుండలేశ్వరుడు
కాట్రేనికోన: మండల శివారు కుండలేశ్వరంలోని శివలింగం కుండలం (చెవి కుండలం)ఆకారంలో ఉంటుంది. సముద్రుడు (వర్ణుడికి సూర్యుడు, సముద్రుడికి వర్ణుడు) బహుమతిగా ఇచ్చిన రెండు కుండలాలను గౌతముడు.. వృద్ధ గౌతమికి బహుమతిగా అందించారు. వృద్ధ గౌతమీ నదీ తీరాన్ని ఆనుకుని ఈ క్షేత్రంలో పుణ్యస్నానం ఆచరించి కుండలేశ్వరుని దర్శించుకున్న వారిలో నారదుడు, మార్కండేయుడు, శంకరాచార్యులు, శ్రీనాథుడు తదితరులు ఉన్నారని భక్తుల నమ్మకం. స్వామివారిని దర్శిస్తే అనంత కుండలాల ఫలం వస్తుందని బ్రహ్మ పురాణంలో నారద మహామునికి బ్రహ్మదేవుడు చెప్పాడని నానుడి.

ఆధ్యాత్మిక సీమ

ఆధ్యాత్మిక సీమ

ఆధ్యాత్మిక సీమ

ఆధ్యాత్మిక సీమ

ఆధ్యాత్మిక సీమ

ఆధ్యాత్మిక సీమ

ఆధ్యాత్మిక సీమ