
పోలీస్ అమర వీరులకు నివాళి
● 31 వరకూ వారోత్సవాలు
● షెడ్యూల్ వెల్లడించిన ఎస్పీ రాహుల్ మీనా
అమలాపురం టౌన్: పోలీస్ అమర వీరుల వారోత్సవాలను ఈ నెల 31వ తేదీ వరకూ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. అమలాపురం ఎస్పీ కార్యాలయం నుంచి ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. అమర వీరుల వారోత్సవాల సందర్భంగా రోజు వారీ షెడ్యూల్‌ను వివరించారు. దీనిలో భాగంగా తొలి రోజు మంగళవారం అమలాపురంలోని పోలీస్ అమర వీరుల స్థూపం వద్ద సంస్మరణ దినం, నివాళులు అర్పించారు. అమర వీరుల కుటుంబ సభ్యులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.
● బుధవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకూ అమర వీరుల గ్రామాలకు, పట్టణాలకు పోలీసులు వెళతారు. అమర వీరులు చదివిన పాఠశాలల్లో వారి ఫొటోలు ఏర్పాటు చేస్తారు. ఏదైనా రోడ్డు, అభివృద్ధి పనులకు అమర వీరుడి పేరు పెట్టేలా సూచిస్తారు.
● ఈ నెల 24 నుంచి 27 వరకూ వివిధ విద్యా సంస్థల్లో చర్చా వేదికలు, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తారు. పోలీసుల పిల్లలను జిల్లా ఎస్పీ కార్యాలయానికి పిలిచి, వారికి పర్యావరణ పరిరక్షణలో పోలీసుల పాత్రపై చర్చా వేదికలు నిర్వహిస్తారు.
● 26న పోలీసుల త్యాగాలు, పరాక్రమాలను తెలియజేసే చిత్రాలను ప్రదర్శిస్తారు. అదే రోజు పోలీసు కథాంశాలతో సందేశాత్మక సినిమాలను థియేటర్లు, కేబుల్ టీవీల్లో ప్రదర్శిస్తారు.
● 26, 27 తేదీల్లో జిల్లా పోలీస్ కేంద్రం, పోలీస్ సబ్ డివిజన్ కేంద్రాలు, పోలీస్ స్టేషన్లలో ఓపెన్ హౌస్‌లు నిర్వహిస్తారు. పోలీసులు వినియోగించే ఆయుధాలు, సాధనాలు, పరికరాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు.
● 28న జిల్లా వ్యాప్తంగా పోలీసుల వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. రక్తదానాలు, సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతారు. 29న పోలీస్ త్యాగాలపై సెమినార్లు, ఉపన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు.
● 30న పోలీసు అమర వీరుల కుటుంబాల్లో ప్రత్యేక సాధకులకు సన్మానాలు చేస్తారు. 31న సమైక్యత దినాన్ని పాటిస్తారు. ఆ రోజు జిల్లా వ్యాప్తంగా పోలీసులు యూనిట్ రన్, కొవ్వొత్తుల ప్రదర్శన, ర్యాలీలు నిర్వహిస్తారు.