
విద్యా ప్రగతిలో కీలక ముందడుగు
● కలెక్టర్ మహేష్ కుమార్
● టెన్త్ వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక పోస్టర్ల విడుదల
అమలాపురం రూరల్: విద్యా అభివృద్ధి దిశలో మరో కీలక ముందడుగు పడిందని కలెక్టర్ ఆర్. మహేష్‌కుమార్ అన్నారు. 2025–26 విద్యాసంవత్సరానికి పదో తరగతి వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక పోస్టర్లను కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు సమన్వయంతో పనిచేస్తే జిల్లాలోని విద్యా ప్రమాణాలు రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలుస్తాయని అన్నారు. విద్యార్థుల విద్యా ప్రగతికి ఈ ప్రణాళిక మరింత బలమైన పునాదిగా నిలుస్తుందన్నారు. డీఈవో షేక్ సలీం బాషా మాట్లాడుతూ వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో బోధన, పునశ్చరణ, మాక్ టెస్టులు, పాఠ్య ప్రగతి విశ్లేషణ, సమగ్ర మూల్యాంకనానికి సంబంధించిన అంశాలు సమగ్రంగా పొందుపర్చారన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉమ్మడి పరీక్షల నిర్వహణ సంస్థ సెక్రటరీ బి.హనుమంతరావు, సీఎంవో బీవీవీ సుబ్రహ్మణ్యం, మహాత్మాగాంధీ మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ పాల్గొన్నారు.
● పీఎం ఆదర్శ గ్రామ యోజన పథకంలో నిలిచిపోయిన పనులను పూర్తి చేసి, గ్రామ అభివృద్ధి ప్రణాళికలలో అవసరం లేని పనులకు కేటాయించిన నిధులు వేరే పనులకు మళ్లించాలని కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన మొదటి రెండు దశల గ్రామాభివృద్ధి ప్రణాళికలపై డీఎల్‌డీఓలు, ఎంపీడీవోలతో ఆయన సమీక్షించారు. 40 శాతం పైబడి ఎస్సీలు ఉన్న గ్రామాలలో సామాజిక ఆర్థిక మానవాభివృద్ధికి ఈ పథకం కీలక భూమిక పోషిస్తుందన్నారు.
● ధవళేశ్వరం వద్ద మంజూరైన వాటర్ గ్రిడ్ పథకం పైపులైన్ నిర్మాణం వల్ల కలిగే డ్యామేజీలకు ఇంజినీర్లు 15 రోజులలో మాస్టర్ ప్లాన్ ప్రకారం అంచనాలను రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. ముందుగా డ్యామేజీలను గుర్తించడం వల్ల ఆయా పనుల నిర్వహణకు నిధులు కేటాయింపునకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు.