
సురక్షిత సమాజ నిర్మాణంలో పోలీసులు కీలకం
● ఘనంగా అమర వీరుల దినోత్సవం
● నివాళుర్పించిన ప్రజాప్రతినిధులు,
అధికారులు
అమలాపురం టౌన్: సురక్షిత సమాజ నిర్మాణంలో పోలీసుల పాత్ర కీలకమని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్, ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. అమలాపురంలోని పోలీసు అమర వీరుల స్థూపం వద్ద మంగళవారం ఉదయం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంస్మరణ దినం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, ఎమ్మెల్యే అయిబత్తుల ఆనందరావు హాజరై పోలీసుల త్యాగాలను ప్రసంగించారు. తొలుత మంత్రి, కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు అమర వీరుల స్థూపం వద్ద పుష్ప గుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా సాయుధ పోలీసులు కవాతు నిర్వహించి అమర వీరులకు వందనం చేశారు. పోలీసు అమర వీరుల కుటుంబ సభ్యులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వారికి జిల్లా పోలీస్ శాఖ తరపున జ్ఞాపికలు, ఆర్థిక సహాయం అందించారు.
మంత్రి సుభాష్ మాట్లాడుతూ పోలీసులు తమ వీరోచిత పోరాటాలను స్మరించుకుంటూ సమాజ భద్రతకు పునరంకింతం కావాలని సూచించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు మాట్లాడుతూ పోలీసుల అమర వీరుల సంస్మరణ దినం ఉద్దేశాన్ని వివరించారు. ఎమ్మెల్సీ ఇజ్రాయిల్, ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ పోలీసు అమర వీరుల త్యాగాలు చిరస్మరణీయమన్నారు. ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ అమరులైన పోలీసులకు జిల్లా పోలీస్ శాఖ నిర్వహిస్తున్న సహాయ కార్యక్రమాలను వివరించారు. విధి నిర్వహణలో వీర మరణం పొందిన ఎస్సై అశోక్, కానిస్టేబుల్ బ్లెసన్ జీవన్ కుటుంబ సభ్యులకు జ్ఞాపికలతో పాటు ఆర్థిక సాయం అందజేశారు. జిల్లా ఏఆర్ డీఎస్పీ సుబ్బరాజు ఈ ఏడాది విధి నిర్వహణలో దేశ వ్యాప్తంగా 191 మంది, రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు అమరులయ్యారని తెలిపారు. అమలాపురం, కొత్తపేట, రామచంద్రపురం డీఎస్పీలు టీఎస్‌ఆర్‌కే ప్రసాద్, సుంకర మురళీ మోహన్, రఘువీర్, ఎస్పీ కార్యాలయ ఎస్బీ సీఐ వి.పుల్లారావు పాల్గొన్నారు.