
గళమెత్తిన కలం వీరులు
● ‘సాక్షి’పై వేధింపులు అప్రజాస్వామికం
● జిల్లాలో పాత్రికేయుల నిరసనలు
● పత్రికా స్వేచ్ఛను కాపాడాలని నినాదాలు
● మద్దతు తెలిపిన ఏపీయూడబ్ల్యూజే,
ప్రజా సంఘాలు
సాక్షి, అమలాపురం: పత్రికా స్వేచ్ఛను అడ్డుకుంటారా.. అక్రమ కేసులతో భయపెట్టాలనుకుంటారా.. ‘సాక్షి’ మీడియా గొంతు నొక్కాలనుకుంటారా.. ఇలాంటి కుట్ర రాజకీయాలు వీడండంటూ జిల్లా వ్యాప్తంగా కలం వీరులు గళమెత్తారు. రాజ్యాంగ హక్కులు... పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ ‘సాక్షి’ని అణిచివేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రను పాత్రికేయులు, ప్రజా సంఘాల నాయకులు తూర్పారబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న నకిలీ మద్యం వ్యవహారంలో నిజాలను నిర్భయంగా వెలికి తీస్తున్న ‘సాక్షి’పై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలను ఖండించారు. ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులు, వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శలు, ర్యాలీలు నిర్వహించి అధికారులకు వినతులు అందజేశారు.
రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీపై ‘సాక్షి’ దినపత్రికలో కథనాలు ప్రచురితం కావడం కూటమి ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. పత్రికా స్వేచ్ఛ, భావన ప్రకటన హక్కును కాలరాస్తూ ‘సాక్షి’ ఎడిటర్, విలేకరులపై అక్రమ కేసులు బనాయించి పోలీసులతో వేధింపులకు గురి చేస్తున్న విషయం పాఠకులకు విదితమే. ఇందులో భాగంగా నెల్లూరు ‘సాక్షి’ కార్యాలయానికి పోలీసులు రోజుల తరబడి రావడం, సోర్స్ చెప్పాలని ఎడిటర్ ధనంజయరెడ్డి, ఇతర పాత్రికేయులను ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసిందే. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారిన కూటమి తీరును నిరసిస్తూ కోనసీమ జిల్లా వ్యాప్తంగా వివిధ పాత్రికేయులు, ప్రజా సంఘాల నాయకులు నిరసన తెలిపారు. అమలాపురం కలెక్టరేట్ వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమం జరిగింది. ‘సాక్షి’ కార్యాలయంలో సోదాలను ప్రజా సంఘాలు తప్పబట్టాయి. మీడియాపై దాడులు ఆపాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, విలేకర్లపై నిర్బంధాలను అరికట్టాలని నినాదాలు చేశాయి. ‘సాక్షి’పై దాడులు అప్రజాస్వామికమని, ఎడిటర్‌పై కేసులు వెంటనే ఎత్తివేయాలని అన్నారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం నుంచి డీఆర్వో కార్యాలయం వరకూ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ పరిపాలనాధికారి కె.కాశీ విశ్వేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎంఎన్‌వీ ప్రసాద్, సీనియర్ పాత్రికేయుడు టీకే విశ్వనాథం మాట్లాడుతూ పత్రికలలో ప్రతికూల వార్తలు వస్తే ప్రభుత్వం విచారణ జరిపి దానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలే కానీ, ఆ వార్తలు రాసిన జర్నలిస్టులపై కేసులు పెట్టడం సరికాదన్నారు. ‘సాక్షి’ పత్రిక, ఎడిటర్‌పై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కన్వీనర్ కె.వెంకటేశ్వరరావు, బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జి పొలమూరి మోహన్‌బాబు, ‘సాక్షి’ స్టాఫ్ రిపోర్టర్ నిమ్మకాయల సతీష్‌బాబు, ఐజేసీ సభ్యుడు పరసా సుబ్బారావు, అరిగెల రుద్ర శ్రీనివాస్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఉండ్రు కృష్ణప్రసాద్, దొమ్మేటి వెంకట్, మాకే శ్రీనివాసరావు, పొట్టుపోతు నాగు తదితరులు పాల్గొన్నారు.
● కొత్తపేట ఆర్డీఓ, డీఎస్పీ కార్యాలయాల వద్ద పాత్రికేయులు, ప్రజా సంఘాల నాయకులు నిరసన తెలిపారు. పత్రికా స్వేచ్ఛను కాలరాసేలా ‘సాక్షి’పై దాడులు చేయడాన్ని జర్నలిస్టులు ముక్తకంఠంతో ఖండించారు. ఆర్డీఓ పి.శ్రీకర్‌కు, డీఎస్పీ కార్యాలయంలో ఎస్‌ఐ జి.సురేంద్రలకు వినతిపత్రాలు అందజేశారు. సీనియర్ పాత్రికేయులు జగతా శ్రీరామచంద్రమూర్తి, కె.ఆదినారాయణ రెడ్డి, అడపా ప్రసాద్, రాయుడు జయదేవ్, బొరుసు జానకి రామయ్య, బొరుసు సాయి రంగనాథ్‌బాబు, శ్రీకాకుళపు బాబీ తదితరులు పాల్గొన్నారు.
● మామిడికుదురులో తహసీల్దార్ కార్యాలయం ఎదుట పి.గన్నవరం నియోజవర్గానికి చెందిన విలేకరులు నిరసన తెలిపారు. అనంతరం ‘సాక్షి’పై దాడులను నిరసిస్తూ తహసీల్దార్ పి.సునీల్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఏపీయూడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టపర్తి శ్రీనివాస్, మామిడికుదురు మండల ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు ఎన్‌ఎస్‌డీ ప్రసాద్, యేడిద బాలకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
● మండపేట నియోజకవర్గం పరిధి కపిలేశ్వరపురానికి చెందిన పాత్రికేయులు ‘సాక్షి’పై పోలీసుల దా డులను నిరసించారు. ఎంపీడీఓ భానూజీకి వినతిపత్రం అందజేశారు. ప్రజా సంఘాలకు చెందిన పి.లెనిన్‌బాబు, చిట్టి కుమార్, శేఖర్, ఎంపీటీసీ సభ్యులు జిత్తుగ వెంకటలక్ష్మి, వార్డు సభ్యుడు బొక్కా రాంబాబు, దళిత సంఘాల నాయకుడు నక్కా సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
● ముమ్మిడివరం తహసీల్దార్ కార్యాలయం వద్ద పాత్రికేయులు, ప్రజా సంఘాల నాయకులు నిరసన తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్ గోపాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు. జి.ధనుంజయరావు, పోలిశెట్టి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
● రాజోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. తహసీల్దార్ సీహెచ్ భాస్కరరావుకు వినతిపత్రం అందజేశారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర సభ్యుడు సురేంద్ర, జిల్లా సభ్యుడు చింతా మధు, సీనియర్ పాత్రికేయుడు వీవీ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
మీడియా గొంతు నొక్కేలా పోలీసుల ద్వారా ప్రభుత్వం వ్యవహరించడం దారుణం. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డికి నోటీసులు ఇవ్వడం, కార్యాలయంలో సోదాలు చేయడం అప్రజాస్వామికం. ప్రభుత్వం ఇటువంటి చర్యలు విడనాడాలి.
– కె.వెంకటేశ్వరరావు, సీపీఎం జిల్లా కన్వీనర్
పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారు
పత్రికా స్వేచ్ఛను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హరిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. మీడియాపై పోలీసు దాడులను తక్షణం నిలిపివేయాలి. నాలుగైదు రోజులుగా ‘సాక్షి’ కార్యాలయానికి పోలీసులు వెళ్లడం పద్ధతి కాదు.
– పొలమూరి మోహన్‌బాబు, బీఎస్సీ
నియోజకవర్గ ఇన్‌చార్జి, అమలాపురం

గళమెత్తిన కలం వీరులు

గళమెత్తిన కలం వీరులు

గళమెత్తిన కలం వీరులు