
గోవిందా.. హరి గోవిందా
ఫ కొనసాగిన వాడపల్లి వెంకన్న
బ్రహ్మోత్సవాలు
ఫ కల్కి అలంకరణలో శ్రీవారు విహారం
కొత్తపేట: బ్రహ్మోత్సవ వేళ బ్రహ్మాండ నాయకుడిని దర్శించిన వారిది కదా భాగ్యము.. ఆనందంతో దేవదేవుని కనులారా కాంచిన వారిది కదా జన్మ ధన్యము.. వాడపల్లి క్షేత్రంలో శ్రీ, భూ సమేత వేంకటేశ్వర స్వామివారి వార్షిక దివ్య బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఎనిమిదో రోజు శుక్రవారం శ్రీవారు కల్కి అలంకరణలో అశ్వ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తజనుల గోవింద నామస్మరణతో వాడపల్లి క్షేత్రం మార్మోగింది. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం ఖండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చక బృందం, వివిధ ప్రాంతాల వేద పండితులు ఉదయం నుంచి రాత్రి వరకూ నిరంతరాయంగా స్వామివారికి విశేష పూజలు చేశారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం పుణ్యాహవాచనం, పంచామృత మండపారాధన, ప్రధాన హోమాలు, శోభాయాత్రగా ‘గోదావరి నదీ జల సంగ్రహణం’ మహాస్నపనం, దిగ్దేవతా బలిహరణ, లక్ష కుంకుమార్చన, స్వామివారికి ఉభయ దేవేరులతో ‘కల్పవృక్ష వాహన సేవ’, సాయంత్రం స్వస్తివచనం, ప్రధాన హోమాలు నిర్వహించారు. శ్రీవారు కల్కి అలంకరణలో అశ్వ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు స్వామివారిని ఆ వాహనంపై అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలియుగం చివరిలో ధర్మాన్ని స్థాపించడానికి అవతరించిన విష్ణువు చివరి అవతారం కల్కి. గుర్రంపై స్వారీ చేసే అలంకరణ. బ్రహ్మోత్సవాల్లో ఇది ముఖ్యమైన ఘట్టం. కలియుగంలో దుష్టులను సంహరించి ధర్మాన్ని స్థాపించడం ఈ అవతారం ముఖ్య ఉద్దేశాన్ని ఈ సేవ తెలియచేస్తుంది. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు
వాడపల్లి క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగియనున్నాయి. చివరి రోజు నిత్య పూజలు, హోమాలు, అభిషేకాలతో పాటు ఉదయం చక్రస్నానం, ధ్వజావరోహణం, మహాదాశీర్వచనం, ఏకాంతసేవ, నీరాజన మంత్రపుష్పాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.

గోవిందా.. హరి గోవిందా