
నాణ్యమైన బోధనే లక్ష్యం కావాలి
అమలాపురం రూరల్: నాణ్యమైన విద్యా బోధనే లక్ష్యంగా కొత్త ఉపాధ్యాయులు సాగాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. శుక్రవారం అమలాపురం కలెక్టరేట్‌లో కొత్త ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి పరిచయం కార్యక్రమం డీఈఓ సలీం బాషా అధ్యక్షతన నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ జిల్లాను విద్యా రంగంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపేందుకు అంతా కృషి చేయాలన్నారు. విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని, ఆలోచన జ్ఞానాన్ని అలవర్చాలన్నారు. స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, డిజిటల్ టూల్స్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్‌ను వినియోగిస్తూ మెరికల్లాంటి భావిభారత పౌరులను తీర్చిదిద్దాలన్నారు. ఆర్డీఓ కె.మాధవి మాట్లాడుతూ తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించి విద్యార్థుల విద్యాభ్యాస పురోగతిపై పరస్పర చర్చలు సాగించాలన్నారు. సలీం బాషా మాట్లాడుతూ ఉపాధ్యాయులు స్ఫూర్తి కలిగించే మార్గదర్శిగా ఉండాలన్నారు. టెక్నాలజీ పట్ల అవగాహన, దానిని సమర్థంగా వినియోగించే సామర్థ్యం బోధకులకు అవసరమన్నారు సమగ్ర శిక్ష ఏపీసీ జి.మమ్మీ, జిల్లా ఉప విద్యాశాఖ అధికారి జి.సూర్యప్రకాశం పాల్గొన్నారు.
కడలిలోకి 2.08 లక్షల క్యూసెక్కులు
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి శుక్రవారం 2,08,519 క్యూసెక్కుల గోదావరి మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. తూర్పు డెల్టాకు 2,700, మధ్య డెల్టాకు 1,800, పశ్చిమ డెల్టాకు 6 వేల క్యూసెక్కుల నీరు వదిలారు. భద్రాచలంలో 18, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.40 అడుగుల నీటిమట్టం ఉంది.