
ఫుడ్ పాయిజన్
● 20 మందికి అస్వస్థత
● అంబాజీపేటలో కలకలం
అంబాజీపేట: వివిధ పనులు చేసుకుంటూ జీవిస్తున్న కూలీలు ఫుడ్ పాయిజన్ బారిన పడ్డారు. బుధవారం ఆ కూలీలు అంబాజీపేటలోని ఓ హోటల్ నుంచి తీసుకు వచ్చిన టిఫిన్లు తిని అస్వస్థతకు గురయ్యారని భావిస్తున్నారు. గురువారం స్థానిక వైద్యులతో చికిత్స చేయించుకున్నా వారికి స్వస్థత చేకూరకపోవడంతో అంబాజీపేట, అమలాపురంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. కాగా శుక్రవారం రాత్రి అంబాజీపేటలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మాచవరానికి చెందిన 12 మంది బాధితులు చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. ప్రస్తుతానికి వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు చెప్పారు. ఇక్కడ చికిత్స పొందుతున్న వారిలో కుసుమే యమున కుమారి, అరిగెల నాగలక్ష్మి, యలమంచిలి సత్యనారాయణ, యలమంచలి తాతారావు, కుసుమ శ్రీఆకాష్, నేలపూడి విజయకుమారి, కుసుమ భవాని, సరెళ్ల నాగలక్ష్మి, యలమంచలి నాగరత్నం, కుసుమ విమలకుమారి తదితరులు ఉన్నారు. వీరే కాకుండా మరో 8 మంది అమలాపురంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఘటనపై భిన్న వాదనలు
ఈ ఫుడ్ పాయిజన్‌కు సంబంధించి ఓ వైపు బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే, దీనిపై భిన్న వాదనలు వినపడుతున్నాయి. హోటల్ నుంచి తెచ్చిన టిఫిన్ వల్లే ఫుడ్ పాయిజన్ జరిగిందని కొందరు బాధితులు ఆరోపిస్తుంటే, మరి కొంత మంది మాచవరంలో తయారు చేస్తున్న బెల్లం తయారీ కేంద్రంలో వెలువడిన వాయివుల వల్ల ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారని చెబుతున్నారు. అయితే చికిత్స పొందుతున్న బాధితుల నుంచి పి.గన్నవరం సీఐ ఆర్.భీమరాజు, ఎస్సైలు కె.చిరంజీవి, బి.శివకృష్ణ వివరాలు సేకరించారు.