
కల్తీ మద్యంపై లోతుగా దర్యాప్తు జరగాలి
మాజీ మంత్రి గొల్లపల్లి
మలికిపురం: రాష్ట్రంలో కల్తీ మద్యంపై లోతుగా దర్యాప్తు జరగాలని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మలికిపురంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రతీ గ్రామంలోనూ కల్తీ మద్యం ఛాయలు ఉన్నట్లు అనుమానాలున్నాయన్నారు. ఇటీవల కోనసీమ జిల్లా ఉప్పలగుప్తంలో కూడా నకిలీ మద్యం తయారీ వెలుగు చూసిన సంగతి విదితమేనని గొల్లపల్లి గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అరోగ్య పాడయి ఆసుపత్రికి చేరుతున్న ప్రజలకు మరింతగా పరీక్షలు చేయాలని సూచించారు. కల్తీ మద్యం ఆదాయంతో కూటమి నేతలు ఆస్తులు పెరుగుతున్నాయన్నారు. ధనార్జనే ధ్యేయంగా కూటమి పని చేస్తోందన్నారు. ప్రజల ఆరోగ్యం పట్టడం లేదన్నారు. పార్టీ నాయకులు తెన్నేటి కిషోర్, కుసుమ చంద్రశేఖర్, నల్లి రక్షణ పాల్గొన్నారు.
వాడపల్లి వెంకన్నను దర్శించిన
తెలంగాణ హైకోర్టు జడ్జి
కొత్తపేట: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి టి.మాధవీదేవి, మచిలీపట్నం జిల్లా జడ్జి పి.పాండురంగారెడ్డి కుటుంబ సమేతంగా ఆదివారం వాడపల్లి వేంకటేశ్వరస్వామిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారిని వేద మంత్రోశ్చారణ నడుమ దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు వారికి స్వామివారి చిత్రపటాలను అందచేశారు.
ఏసీ బస్సులో 10 శాతం రాయితీ
అమలాపురం రూరల్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అమలాపురం డిపో నుంచి హైదరాబాద్ కి నడుపుతున్న అమరావతి ఏసీ బస్సు టికెట్ రేట్లలో 10శాతం రాయితీ అక్టోబర్ 31 వ తేదీవరకు అమలులో ఉంటుందని జిల్లా ప్రజా రవాణాధికారి ఎస్‌టీపీ రాఘవకుమార్ తెలిపారు. అమలాపురం నుంచి హైదరాబాద్ ఎంజీబీఎస్ రూ.1,250, అమలాపురం నుంచి బీహెచ్‌ఈఎల్ వరకు రూ.1,300 ధరతో టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. అమలాపురం డిపో నుంచి రాత్రి 8.30 గంటలకు సర్వీస్ నెంబర్ 2572, హైదరాబాద్ నుంచి రాత్రి 7.45 గంటలకు సర్వీస్ నెంబర్ 2573 బయలుదేరుతాయన్నారు. ఈ సర్వీస్ విజయవాడ నుంచి హైదరాబాద్‌కు నాన్‌స్టాప్‌గా నడుపుతున్నట్లు తెలిపారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తత
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): వాతావరణ మార్పుల నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్.సవిత బీసీ సంక్షేమ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని బీసీ సంక్షేమం, చేనేత, జౌళి శాఖలు, లేపాక్షి ఎంపోరియం అధికారులతో ఆమె నగరంలో ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎస్‌ఆర్ నిధులతో బీసీ హాస్టళ్లను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

కల్తీ మద్యంపై లోతుగా దర్యాప్తు జరగాలి