
నూతన మద్యం పాలసీ పెద్ద స్కామ్
అల్లవరం: నూతన మద్యం పాలసీ రాష్ట్రంలోనే పెద్ద స్కామ్‌గా మిగిలిపోతుందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జున్నూరి రామారావు (బాబీ) అన్నారు. అల్లవరం మండలం డి.రావులపాలెంలోని తన నివాసంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీపై సీబీఐ ఎంకై ్వయిరీ వేసి విచారణ చేపట్టాలని రామారావు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం వినియోగం తగ్గించేందుకు ఆమోదయోగ్యమైన మద్యం పాలసీని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చి ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చారన్నారు. అప్పట్లో మద్యం షాపులు ప్రైవేటు వ్యక్తుల చేతిల్లోకి పోకుండా ప్రభుత్వమే నిర్వహించి నాణ్యమైన మద్యాన్ని అమ్మితే టీడీపీ నానా యాగీ చేసిందన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల కాలంలో నకిలీ మద్యం ఏరులై పారుతోందన్నారు. ప్రతి మూడింటిలో ఒక నకిలీ మద్యం బాటిల్ ఉంటోందన్నారు. కమీషన్లు కోసమే కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీని తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. డీలర్ షిప్ తరహాలో రెండు జిల్లాలకు ఒక డిస్టిలరీ యూనిట్ ఏర్పాటు చేసి నకిలీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం విధానాలను ఎండగట్టేందుకు వైఎస్సార్ సీపీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని రామారావు అన్నారు.