
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
యానాం: పట్టణంలో శనివారం సంచలనం కలిగించిన వ్యక్తి దారుణహత్య కేసుకు సంబంధించి నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేసినట్లు సీఐ అడలరసన్ తెలిపారు. ఈ హత్యకేసుకు సంబంధించి వివరాలను ఆయన విలేకరులకు వివరించారు. కాజులూరు మండలానికి చెందిన హతుడు తిపురశెట్టి నారాయణస్వామి 2022, మార్చి 12న యానాం గోపాల్‌నగర్ శివారు మోకా గార్డెన్స్‌కు చెందిన మోకా వెంకటేశ్వరరావు అలియాస్ బుజ్జిని అతని స్వగృహంలోనే కత్తితో పొడిచి హత్య చేశాడన్నారు. ఆర్థిక లావాదేవీలు, చీటీలకు సంబంధించిన సొమ్ము గురించి అప్పట్లో ఆ హత్య జరిగిందన్నారు. ఈ కేసుకు సంబంధించి పుదుచ్చేరి కాలాపేట జైలులో శిక్ష అనుభవిస్తున్న నారాయణస్వామి ఇటీవలి కండిషన్ బెయిల్‌పై విడుదలయ్యాడన్నారు. ప్రతి రోజూ యానాం పోలీస్‌స్టేషన్‌లో సంతకం పెడుతున్నాడని తెలిపారు. శనివారం రాత్రి మోకా వెంకటేశ్వరరావు కుమారుడు మోకా ఆనందమూర్తి బైక్ పై వచ్చి స్థానిక న్యూకాంప్లెక్స్ సమీపంలో మెయిన్‌రోడ్డుపై ఉన్న తిపురశెట్టి నారాయణసామిని కత్తితో విచక్షణా రహితంగా 13 పోట్లు పొడిచాడని దీంతో నారాయణసామి మృతిచెందాడన్నారు. శనివారం మోకా ఆనందమూర్తి కుమారుడు, వెంకటేశ్వరరావు మనుమడు పుట్టినరోజు అని తెలిపారు. దీంతో తన తండ్రి ఉంటే మనుమడి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగేవని కాని తన తండ్రి లేకుండా చేసింది నారాయణస్వామి అని కక్ష పెంచుకున్నాడన్నారు. ఈ నేపథ్యంలో మద్యం తాగి రావడం.. యాధృచ్చికంగా మెయిన్‌రోడ్డుపై నిలబడి ఉన్న నారాయణస్వామి కనిపించడంతో విచక్షణారహితంగా కత్తితో పొడిచి చంపాడన్నారు. అతని మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. నిందితుడి నుంచి కత్తి, బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని సబ్‌కోర్టుకు హాజరుపరచగా రిమాండ్ విధించారన్నారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్న క్రైమ్‌టీమ్ జాంటీ, దుర్గారావు ను అభినందించారు. ఈ సమావేశంలో ఎస్సైలు పునీత్‌రాజ్, కట్టా సుబ్బరాజు పాల్గొన్నారు.