
చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి
● పాల దిగుబడి పెంచేందుకు ప్రణాళిక
● కలెక్టర్ మహేష్ కుమార్
అమలాపురం రూరల్: వెండర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ద్వారా చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. ఆయన మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమల కేంద్రం సెంటర్ ఫర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విభాగం సంయుక్తంగా ఎంఎస్‌ఎంఈ ఉత్పత్తుల కొనుగోలుదారులు ఉత్పత్తి దారులతో రెండు రోజులు నిర్వహించనున్న వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సరఫరాదారుల నైపుణ్యాలను, సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా సరఫరా గొలుసులో వినూత్నత, నాణ్యత, ఆదాయాన్ని మెరుగుపరిచేందుకు ఈ వర్క్‌షాప్ ఉపకరిస్తుందన్నారు. సాంకేతిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ వెంకటకృష్ణ మాట్లాడుతూ ఉత్పత్తి, కొనుగోలు సంస్థల మధ్య ప్రత్యక్ష భేటీల నిర్వహణ ద్వారా సత్సంబంధాలు బలపడి వ్యాపార అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ అరుణ, సహాయ సంచాలకులు శివరాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
చేనేత సంఘాలతో సమావేశం
అరటి పీచు ద్వారా వినూత్న ఆలోచనలతో వస్త్రాల తయారీపై వివిధ చేనేత సహకార సంఘాలను ప్రోత్సహించాలని కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. ఆయన కలెక్టరేట్‌లో చేనేత జౌళిశాఖ, 23 చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కొత్తపేట నియోజకవర్గంలో అరటి గెల నరికిన తర్వాత కాండం నిరుపయోగంగా ఉంటోందని, దాని ద్వారా పీచు తయారు చేస్తూ ఆకర్షణీయమైన వస్త్రాలను రూపొందించేందుకు సంఘాలు ముందుకు రావాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు కె.పెద్దిరెడ్డి, చేనేత సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
పీఏసీఎస్‌ల ద్వారా మిశ్రమ దాణా
పాడి పరిశ్రమ అభివృద్ధికి పోషక విలువలు కలిగిన ప్రోటీన్ టోటల్ మిక్సర్ రేషన్‌ను ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. దీనిపై కలెక్టరేట్‌లో జిల్లా పశుసంవర్థకశాఖ అధికారులు, జిల్లా సహకార శాఖ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాల దిగుబడిని పెంచే దిశగా మిశ్రమ దాణా సరఫరాపై సమీక్షించారు. ముందుగా సంఘాల పరిధిలో గేదెల యూనిట్లను గుర్తించి ఆ ప్రకారం ముందుగా కంపెనీల ద్వారా ఎంపిక చేసిన టెండర్లకు అనుగుణంగా దాణాను ఆయా సహకారసంఘాలకు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎరువులను అధికంగా విక్రయించే 9 సొసైటీల ద్వారా దాణాను కూడా విక్రయించాలని నిర్ణయించారన్నారు. 8 నుంచి 10 లీటర్ల పాలిచ్చే పశువులకు సమీకృత దాణాను రోజుకు 2 కిలోల చొప్పున పెడితే సుమారు లీటరు నుంచి అర లీటరు వరకు పాలు పెరిగే అవకాశం ఉందన్నారు. సమావేశంలో పశుసంవర్ధక శాఖ అధికారి వెంకట్రావు, డీడీ కె.మూర్తి, ఏడీ ఉమా మహేశ్వర్‌రెడ్డి, సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.