
చివరిలో చెలరేగినా..
సాక్షి, అమలాపురం: నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముఖం చాటేశాయి. రుతు పవనాలు వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రతి నెలా లోటు వర్షమే కురిసింది. అయితే తిరోగమనానికి సమయం దగ్గర పడుతున్న తరుణంలో జిల్లా వాసులకు ఊరటనిస్తూ గడిచిన రెండు రోజులుగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. కానీ అడపాదడపా భారీ వర్షాలు కురిసినా లోటు వర్షమే నమోదవుతోంది. జిల్లాలో ఖరీఫ్ సాగుకు ఇబ్బంది లేకున్నా రెండు వేసవిలను చవి చూడాల్సి రావడంతో సామాన్యులు ఇబ్బందులు పాలయ్యారు.
స్తంభించిన జీవనం
జిల్లాలో గడిచిన రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం ఉదయం ఎనిమిది గంటల వరకు జిల్లాలో సగటున 22.1 మిల్లీమీటర్ల వర్షం కురవగా, అత్యధికంగా మలికిపురం మండలంలో 75.4 మి.మీటర్లు, అత్యల్పంగా కొత్తపేటలో 1.8 మిల్లీమీటర్ల చొప్పున నమోదైంది. ఆ తరువాత కూడా మోస్తరు వర్షం కురుస్తూనే ఉంది. వాన కారణంగా సామాన్య జీవనం స్తంభించింది. చిరు వ్యాపారులు ఇబ్బంది పడ్డారు.
రోడ్లపైకి ముంపునీరు
జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణంతో పాటు మలికిపురం, ఐ.పోలవరం, అంబాజీపేట, పామర్రు వంటి మండలాల్లో రోడ్లపైకి ముంపునీరు చేరి వాహన చోదకులు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అంబాజీపేట అరటి మార్కెట్‌లో అమ్మకాలకు వర్షం అడ్డంకిగా మారింది. ఈ రెండు రోజులు మినహా ఇప్పటి వరకు జిల్లా సగటు కన్నా లోటు వర్షమే పడింది. జూన్ ఒకటి నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 938.2 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, ఇంత వరకు 617.8 మి.మీటర్లు మాత్రమే పడింది. ఇది సగటు కన్నా 45 శాతం తక్కువ. ఈ నెలలో గడిచిన రెండు రోజుల నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. సోమవారం ఉదయం ఎనిమిది గంటల వరకు 10.4 మిల్లీమీటర్లు, మంగళవారం ఉదయం ఎనిమిది గంటల వరకు 22.1 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. ఎనిమిది గంటల తరువాత కూడా జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది.
జిల్లాలో వర్షం ఇలా..
జిల్లాలో మంగళవారం ఉదయం ఎనిమిది గంటల వరకు భారీ వర్షం కురిసింది. కె.గంగవరం మండలంలో 41.6 మి.మీటర్లు, అయినవిల్లి 37,4, మామిడికుదురు 36.2, సఖినేటిపల్లి 32.2, అల్లవరం 30.4, ఐ.పోలవరం 28.8, ముమ్మిడివరం 28.6, ఆలమూరు 25.4, కపిలేశ్వరపురం 23, రావులపాలెం 17.8, అంబాజీపేట 15.2, ఉప్పలగుప్తం 13.8, అమలాపురం 13.2, కాట్రేనికోన 12.6, పి.గన్నవరం 11.8, రాజోలు 11.2, రామచంద్రపురం 10.6, రాయవరం 9.6, ఆత్రేయపురం 8.6, మండపేట 2, కొత్తపేట 1.8 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
గట్టెక్కించిన వరద
వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ డెల్టాలో ఖరీఫ్‌కు ఇబ్బంది లేకపోవడానికి కారణం గోదావరిలో ఈ ఏడాది వరసగా ఐదుసార్లు వచ్చిన వరద అని చెప్పవచ్చు. ఈ ఏడాది ఇన్‌ఫ్లో ఆశాజనకంగా ఉంది. జిల్లాలో తూర్పు, మధ్య డెల్టాలో కలిపి ఈ ఏడాది 1.63 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరుగుతున్న విషయం తెలిసిందే. వర్షాభావం అయినా గోదావరి కాలువ ద్వారా సమృద్ధిగా నీరందడంతో సాగుకు ఢోకా లేకుండా ఉంది. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఇప్పటి వరకు ధవళేశ్వరం బ్యారేజీకి 4,301.531 టీఎంసీల ఇన్ ఫ్లో వచ్చింది. దీనిలో తూర్పు డెల్టాకు 42.810 టీఎంసీలు, మధ్య డెల్టాలకు 21.491 టీఎంసీలు, పశ్చిమ డెల్టాకు 58.499 టీఎంసీల నీటి చొప్పున కాలువలకు మొత్తం 122.800 టీఎంసీల నీరు విడుదల చేశారు. మిగిలిన 4,178.731 టీఎంసీల వృథా జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు.
వర్షం కారణంగా అంబాజీపేట మార్కెట్ యార్డులో నిలిచిన అరటి గెలల ఎగుమతి
భారీ వర్షంతో నిర్మానుష్యంగా మారిన అమలాపురం – బొబ్బర్లంక రహదారి
ఐ.పోలవరం మండలం కొమరగిరిలో నీట మునిగిన కాలనీ
ఈశాన్యంలో వర్షాలొద్దు
నైరుతిలో వర్షాభావ పరిస్థితులపై ఆందోళనతో ఉన్న రైతులు.. ఈశాన్యంలో మాత్రం వర్షాలు కురవకూడదని కోరుకుంటున్నారు. సాధారణంగా అక్టోబర్ 20 నుంచి నవంబర్ నెలాఖరు వరకు ఈశాన్య రుతుపవనాల వల్ల భారీ వర్షాలు కురవడం, పంట చేతికి వచ్చిన చేలు నీట మునిగి రైతులు నష్టపోవడం పరిపాటిగా మారింది. గడిచిన రెండు దశాబ్దాలలో 13 ఏళ్లు ఖరీఫ్ చేతికి వచ్చిన సమయంలో వర్షాల వల్ల నష్టపోవడం రైతులకు సర్వసాధారణమైంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఖరీఫ్ రైతులు ఈశాన్య రుతుపవనాల కాలంలో భారీ వర్షాలు కురవకూడదని కోరుకుంటున్నారు
ఆదుకోని నైరుతి రుతుపవనాలు
జూన్ నుంచి ఇప్పటి వరకు
35 శాతం తక్కువ వర్షపాతం
ఖరీఫ్‌లో డెల్టాను ఆదుకున్న
గోదావరి వరద
రెండు రోజులుగా భారీ వర్షాలు
మంగళవారం 22.1 మిల్లీమీటర్లు నమోదు
జిల్లాలో వర్షపాతం వివరాలు
నెల కురవాల్సినది కురిసింది లోటు
మి.మీలో మి.మీలో శాతం
జూన్ 111.4 105.9 4.9
జూలై 241 112.2 53.4
ఆగస్టు 229.7 203.5 11.4
సెప్టెంబర్ 196.8 117.7 40.2
అక్టోబర్ 159.3 78.5 50.7
(14 వరకు)

చివరిలో చెలరేగినా..

చివరిలో చెలరేగినా..

చివరిలో చెలరేగినా..