
పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసన
సఖినేటిపల్లి: అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్ నిర్వహణలో పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం హార్బర్‌లో స్థానిక మత్య్సకారులు నిరసన వ్యక్తం చేశారు. హార్బర్ నిర్వహణ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని, దీనిని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానికుడు వనమాలి శ్రీనివాసరావు మాట్లాడుతూ సుమారు 40 ఏళ్లుగా ఇక్కడ జీవిస్తున్నామని, ఎటువంటి సమాచారం ఇవ్వకుండా హార్బర్ నిర్వహణను పీపీపీ పద్ధతిలో టెండర్ ప్రక్రియ చేపట్టి కాంట్రాక్టర్‌కు అప్పగించాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. హార్బర్ నిర్మాణానికి ఫిషర్‌మెన్ ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ భూమి 20 ఎకరాలు ఇచ్చామని, గ్రామస్తులతో పాటు వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారంతా కలసి ఇక్కడ మంచి వాతావరణంలో వేట కొనసాగిస్తున్నట్టు తెలిపారు. స్థానికేతరులు వేట విరామం సమయంలో స్వగ్రామాలకు వెళ్లి, అనంతరం తిరిగి వచ్చి తమతో పాటు ఉంటారని అన్నారు. కాగా పీపీపీ పద్ధతిలో కొంత మంది తమకు కావాల్సిన వారిని జీతాలకు పెట్టుకుని, తమను బయటకు గెంటేసే పద్ధతిలో ఉన్నారని, మత్స్య సంపదను ఇక్కడ అమ్మడానికి వీల్లేదంటూ అప్పుడే ఒత్తిళ్లు తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యక్తుల నిర్వహణ వల్ల తమ బతుకు తెరువుకు ఇబ్బందిగా మారనుందని, తమకు పూర్తి న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రామస్తుడు పొన్నాల జయకృష్ణ మాట్లాడుతూ గ్రామస్తుల జీవనోపాధి మెరుగుపర్చేందుకు హార్బర్‌కు స్థలం ఇచ్చామని, గ్రామంలో ఎవరినీ సంప్రదించకుండా మధ్యస్థంగా పీపీపీ పద్ధతిలో టెండర్ ప్రక్రియకు చర్యలు తీసుకోవడం తగదని అన్నారు. పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.