
అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకోవాలి
రామచంద్రపురం: రాయవరంలో శ్రీగణపతి ఫైర్ వర్క్స్ కేంద్రంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ. 50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించి, ఆదుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం స్థానికంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఐఎఫ్‌టీయూ ఉమ్మడి జిల్లా కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు, పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్ధూ, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకుడు వెంటపల్లి భీమశంకరం తదితరులు మాట్లాడారు. ఆ ఫైర్ వర్క్స్‌లో సుమారు 50 మంది కార్మికులు పనిచేస్తుండగా, ఆ రోజు 30 మంది మాత్రమే వచ్చారని, భోజన విరామ సమయంలో ప్రమాదం సంభవించడంతో మరణాల సంఖ్య కొంత తగ్గిందన్నారు. అయినప్పటికీ, నీటి వనరులు అందుబాటులో లేకపోవడం, అగ్నిమాపక చర్యల్లో నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం తీవ్రరూపం దాల్చిందన్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా రెవెన్యూ, అగ్నిమాపక, పరిశ్రమల, కార్మిక శాఖలు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత సంఘటన స్థలాన్ని సందర్శించినా ఇప్పటి వరకూ ఎటువంటి నష్ట పరిహారం ప్రకటించకపోవడం విచారకరమన్నారు. క్షతగాత్రులకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాయవరం మండలంలోని అన్ని ఫైర్ వర్క్స్ యూనిట్లను తక్షణం తనిఖీ చేసి, భద్రతా ప్రమాణాలపై సమీక్ష చేపట్టాలని అధికారులను కోరారు.